Hayath Nagar | హైదరాబాద్లోని హయత్నగర్లో విజయవాడ హైవేపై స్థానికులు ఆందోళనకు దిగారు. ఇక్కడ తరచూ రోడ్లు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రహదారా? మృత్యు మార్గామా అని ప్రశ్నిస్తూ ఫ్లకార్డులు, ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఇటీవల రోడ్డు దాటుతుండగా ఎంబీబీఎస్ విద్యార్థిని ఐశ్వర్య మరణించిన నేపథ్యంలో హైవేకి ఇరువైపుల ఉన్న కాలనీవాసులు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ – విజయవాడ హైవేపై రోడ్డు దాటేందుకు వీలుగా ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలని డిమాండ్ చేశారు.
హయత్ నగర్ కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి, మన్సూరాబాద్ కార్పొరేటర్ నరసింహారెడ్డితో పాటు విజయవాడ హైవేకి ఇరువైపులా ఉన్న కాలనీల వాసులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. వారు హైవేని దిగ్బంధం చేయడంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి, భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో అక్కడకు వచ్చిన పోలీసులు.. నిరసనకారులతో మాట్లాడారు.