సిటీబ్యూరో, జూన్ 22 (నమస్తే తెలంగాణ): గంజాయి స్మగ్లింగ్‌లో ఇబ్బందులు ఎదురవుతుండడంతో గంజాయి నూనె(హాష్ ఆయిల్)పై డ్రగ్ స్మగ్లర్లు దృష్టి పెట్టారు. ఏపీ, ఒడిశా రాష్ర్టాల నుంచి గంజాయి హైదరాబాద్‌తో పాటు మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాలకు స్మగ్లింగ్ అవుతుంది. గంజాయి పత్త(ఆకు) తేలిక బరువు ఉండడంతో ఎక్కువ పరిమాణంలో తీసుకెళ్లాలంటే కార్లు, లారీలు అవసరపడుతుంటాయి. ఒకేసారి ఈ ముఠాలు పదులు, వందల కిలోల్లో స్మగ్లింగ్ చేస్తుంటాయి.
దీంతో తప్పనిసరిగా ప్రత్యేకంగా వాహనాలను ఉపయోగించాల్సి వస్తుండడంతో గంజాయితో వచ్చే వాహనాల కదలికలను గుర్తిస్తున్న పోలీసులు స్మగ్లర్ల ఆట కట్టిస్తున్నారు. 40 కిలోల గంజాయితో ఒక కేజీ హాష్ ఆయిల్ తయారు చేస్తారు. అయితే ఒక కేజీ హాష్ ఆయిల్ దాదాపు 40 కిలోల గంజాయి ఇచ్చే కిక్కునిస్తోంది. ఈ నేపథ్యంలోనే గంజాయి కంటే హాష్ ఆయిల్‌నే ఈజీ స్మగ్లింగ్ చేస్తున్నారు.
గంజాయి 40 కిలోల రవాణా చేయాలంటే ఎన్నో చెక్‌పోస్టులు, ఎంతో మంది కండ్లు గప్పి రవాణా చేయాల్సి ఉంటుంది. అదే తక్కువ పరిమాణంతో ఒక కిలో హాష్ ఆయిల్‌ను తీసుకెళ్లడం ఈజీగా అవుతుంది. దీంతో డ్రగ్స్ సరఫరా చేసే సూత్రధారులు, తయారు చేసేవాళ్లు హాష్ ఆయిల్‌పైనే ఎక్కువ దృష్టిపెట్టినట్లు పోలీసులకు సమాచారం అందుతుంది. ఇందులో భా గంగానే ఇప్పుడు హాష్ ఆయిల్ స్మగ్లింగ్చేసే వారిపై శివారు ప్రాంతాల్లో నిఘాను కట్టుదిట్టం చేశారు. ఇటీవల రూ.1.2 కోట్ల విలువైన 20 కిలోల హాష్ ఆయిల్‌ను రాచకొండ ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు.
ఇంత పెద్ద ఎత్తున హాష్ ఆయిల్ పట్టుబడడం రాష్ట్రంలో ఇదే మొదటిసారి అని రాచకొండ పోలీసులు వెల్లడించారు. అయితే స్మగ్లర్లు హాష్ ఆయిల్‌ను తక్కువ పరిమాణంలో ఒకచోట నుంచి మరో చోటకు తీసుకువెళ్లేందుకు వీలుగా ప్యాక్‌చేసి రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తిస్తున్నారు. సాధారణంగా బస్సులు, రైళ్లు, లారీలు, ద్విచక్రవాహనాలపైనా తక్కువ పరిమాణాల్లో తీసుకొచ్చినా ఎవరికి అనుమానం రాకుండా ఉంటుందని స్మగ్లర్లు ఈ రూట్‌ను ఎంచుకుంటున్నట్లు పోలీసులు వెల్లడిస్తున్నారు.
గంజాయి, హాష్ ఆయిల్ ఎక్కువగా యువత చేతికి చిక్కుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హాష్ ఆయిల్ తక్కు వ మొత్తంలో తీసుకున్నా ఎక్కువ కిక్ ఇస్తుండడంతో దీనికే డ్రగ్ వినియోగదారులు ఆకర్షితులవుతున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. గంజాయికి అలవాటు పడుతూ తమ విలువైన జీవితాన్ని పాడుచేసుకుంటున్నారు.
వీకెండ్ పార్టీలు, బర్త్‌డే, తదితర పార్టీలకు నగర శివారు ప్రాంతాల్లోని ఫామ్ హౌస్‌లను ఎంచుకుంటూ అర్ధరాత్రుల్లో వాహనాలను అతివేగంగా, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తూ కొందరు ప్రమాదాల బారిన పడుతున్నారు. మరికొందరు కాలేజీలు డుమ్మా కొట్టి గంజాయి, హాష్ ఆయిల్‌కు అలవాటు పడుతున్నారు. సాధారణంగా గంజాయి, హాష్ ఆయిల్ వాడుతున్నా, విక్రయించినా, రవాణా చేసిన సమాచారం పోలీసులకు ఇవ్వాలని, వెంటనే స్పందించి ఆయా ముఠాల ఆటకట్టిస్తారని పోలీసులు సూచిస్తున్నారు.