ఆకుపచ్చని రాష్ట్రమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రారంభించిన హరితహారం గ్రేటర్లో లక్ష్యానికి అడుగు దూరంలో ఉంది. ఈ ఏడాది ఏడో విడుతలో భాగంగా గ్రేటర్‌వ్యాప్తంగా కోటి మొక్కలు నాటాలని బల్దియా సంకల్పించగా, ఇప్పటివరకు 93 లక్షలు నాటి రికార్డు సృష్టించింది. గ్రేటర్లో కోటి మొక్కలు నాటడం,పంపిణీ చేయడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ జూలై మాసంలో పచ్చటి కార్యాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా మంగళవారం వరకు 93 లక్షలు నాటారు. ఈనెల 15వ తేదీలోపు కోటి మొక్కలు నాటి విజయవంతం చేస్తామని అధికారులు పేర్కొన్నారు.
సికింద్రాబాద్, ఖైరతాబాద్, చార్మినార్, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, కూకట్పల్లి జోన్ల పరిధిలో 600 నర్సరీలలో మొక్కలను పంపిణీ చేశారు. గతంలో కంటే ఎక్కువశాతం మొక్కలు నాటడంపై ప్రత్యేక దృష్టి సారించిన జీహెచ్ఎంసీ అర్భన్ బయోడైవర్సిటీ విభాగం ఖాళీ స్థలాలతోపాటు రహదారుల వెంబడి మల్టీలేయర్ ఎవెన్యూ ప్లాంటేషన్ విరివిగా చేపట్టారు. ఉస్మానియా, సెంట్రల్ యూనివర్సిటీలు, ఎన్జీఆర్ఐతోపాటు ఎక్కువ స్థలాలున్న సంస్థలు, ఖాళీ స్థలాలున్న దేవాదాయశాఖ భూముల్లో యాదాద్రి మోడల్ ప్లాంటేషన్ కింద మొక్కలు నాటారు.
హరిత నిధి ఏర్పాటు చేయడం చాలా మంచి కార్యక్రమం.ఇందులో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భాగస్వాములు అవడం ఖాయం. మొక్కలు నాటడం ద్వారా ప్రకృతిని కాపాడుకోవడం జరుగుతుంది.తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న కార్యక్రమాల్లో హరిత హారం విజయవంతంగా కొనసాగుతుండటం సంతోషకర పరిణామం.- గంగసాని శ్రీధర్, డీఎస్పీ
తెలంగాణ రాష్ట్రంలో హరితహారం కార్యక్రమం చేపట్టడం దేశంలోనే ఎవరు చేయనటువంటి కార్యక్రమం. ఇప్పుడు హరితనిధి ఏర్పా టు నిర్ణయంతో రాష్ట్రంలో పచ్చదనం పెరుగుతున్నది.ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిర్ణయంతో ఆరోగ్య తెలంగాణ సిద్ధించడం ఖాయం. -డాక్టర్ అనూరాధ, ఎస్పిహెచ్వో
మూసాపేట : పోలీస్‌స్టేషన్‌కు వచ్చే వారికి మంచి వాతావరణం ఉండేలా స్టేషన్ ఆవరణలో హరితహారం కింద వందలాది మొక్కలు నాటాం. పచ్చదనంతో కాలుష్యాన్ని దూరం చేయవచ్చు. ప్రకృతి బాగుండాలంటే పచ్చదనం ఎంతో ముఖ్యం. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి నిత్యం వాటిని సంరక్షించడం పనిగా పెట్టుకుని పరిశీలిస్తున్నాం. భవిష్యత్ తరాలకు మనమిచ్చే బహుమతి పచ్చదనం మాత్రమే. స్టేషన్‌కు వచ్చే వారికి స్వచ్చమైన గాలితో పాటు ప్రశాంతతను, ఫ్రెండ్లీ వాతావరణం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నాం.- నర్సింగ్‌రావు, కూకట్పల్లి సీఐ
ఎర్రగడ్డ : హరితనిధి ఏర్పాటుచేయాలన్న సీఎం కేసీఆర్ ఆలోచన చాలా ఉన్నతమైనది. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో ప్రత్యేక నిధికి సంకల్పించడం గొప్ప విషయం. ఇది పర్యావరణ పరిరక్షణకు దోహదం చేయడంతో పాటు అంతరించిపోతున్న అడవులను పెంపొందించేందుకు తోడ్పడుతుంది.- కె.అంజయ్య, విశ్రాంత రెవెన్యూ అధికారి, బోరబండ
గాజులరామారం : పచ్చదనాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం మంచి సత్ఫలితాలినిస్తుంది. మొక్కలను విరివిగా పెంచుతూ పర్యావరణాన్ని కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి హరిత నిధిని ఏర్పాటు చేయడం అభినందనీయం. – జగద్గిరిగుట్ట సిఐ సైదులు
ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమం పలు రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచింది. హరితహారం కార్యక్రమంలో భాగంగా గత ఏడు సంవత్సరాలలో మొక్కలతో రాష్ట్రంలో అడవులు 3 శాతం పెరగడం ముఖ్యమంత్రి కృషికి నిదర్శనం. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళే విధంగా ప్రభుత్వం హరితనిధిని ఏర్పాటు చేసి దానిలో ఉద్యోగులు, ఎన్జీవోలు, ప్రజలను సైతం భాగస్వాములు చేయడం ఆహ్వానించదగ్గ విషయం.- చికిలె మధుబాబు, ఎన్జీఓ ప్రతినిధి
హరితహారం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఓ మహత్తర కార్యక్రమం. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హరితహారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది. పర్యావరణం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమం భావితరాలకు బంగారుబాట అవుతుందన్నారు. కాలుష్యం కారణంగా ఇప్పటికే ఎన్నో చెట్లు నరకడం వలన పర్యావరణం దెబ్బతిన్నది. ప్రభుత్వం దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి హరితనిధిని ఏర్పాటు చేయడం అభినందనీయం. ఇందులో మనందరం భాగస్వాములు కావాల్సిన అవసరముంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం అభినందనీయం. నేను ప్రభుత్వం చేడుతున్న హరిత నిధిలో పాలుపంచుకుంటా. – గడ్డం రవికుమార్, సామాజిక కార్యకర్త
హరిత నిధి ఏర్పాటు నిర్ణయం హర్షించదగినది. ఉపాధికోసం ఎదురుచూసే యువతకు ఉపాధి లభించే అవకాశాలున్నాయి. సొంత స్థలాల్లో పండ్లు, పూల తోటలు పెంచుకుంటే చక్కటి ఆదాయం లభిస్తుంది. నిధికి ప్రతిఒక్కరూ సహకారమందించాలి. – అనంతప్ప, ఏఈవో, వ్యవసాయ విశ్వవిద్యాలయం