ఖైరతాబాద్, ఆగస్టు 23: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన తెలంగాణకు హరితహారానికి ప్రపంచ ఖ్యాతి దక్కిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. పీవీ నరసింహారావు మార్గ్‌లోని పీపుల్స్‌ప్లాజాలో తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 10వ గ్రాండ్ నర్సరీ మేళా (ఆల్ ఇండియా హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ షో)ను సోమవారం మంత్రి సందర్శించారు. ఒక్కో స్టాల్‌కు వెళ్లి అక్కడ ఉన్న నర్సరీల్లో మొక్కలు, వాటి విశేషాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. మానవుడు ప్రకృతి రమణీయతను, అందులో వనాలు, మొక్కలు, పుష్పాలు, ఫలాలను ఆస్వాదించాలని, వాటిని పెంపొందించి రక్షించాలన్నారు.
నేడు మిద్దెలపై కూరగాయలు పెంచుకునే స్థాయికి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారన్నారు. వ్యవసాయ క్షేత్రాలపై ఆధారపడకుండా ఎవరికి ఎంత జాగ ఉంటే అక్కడ స్వచ్ఛమైన పండ్లు, కూరగాయలు మనమే పండించుకోవచ్చన్నారు. ఉద్యాన శాఖ చేపట్టిన టెర్రస్ గార్డెన్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం చేపట్టిన తెలంగాణకు హరితహారం ద్వారా పస్ట్ మ్యాన్ మేన్ ఫారెస్టులు ఉద్భవిస్తున్నాయని, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ మాత్రమే ఇవి ఉండగా, వాటి సరసన తెలంగాణ నిలువడం గర్వకారణమన్నారు. మంత్రి వెంట ఉద్యానవన శాఖ డైరెక్టర్ వెంకట్రాంరెడ్డి, నిర్వాహకుడు ఖలీద్ అహ్మద్ పాల్గొన్నారు.
పీపుల్స్‌ప్లాజాలో ఈనెల 19న ప్రారంభించిన గ్రాండ్ నర్సరీ మేళా సోమవారం చివరి రోజుని ప్రకటించిన నేపథ్యంలో ప్రకృతి ప్రేమికులు భారీగా తరలివచ్చారు. సుమారు 140 స్టాళ్లు ఏర్పాటు చేయగా, తమకు ఇష్టమైన మొక్కలను తీసుకొని వెళ్లారు. సాయంత్రం భారీ వర్షం కురిసినా లెక్క చేయకుండా మొక్కలను కొనుగోలు చేయడం కనిపించింది.