హైదరాబాద్, జూన్ 27 (నమస్తేతెలంగాణ): నగరంలో వరుస రోడ్డు ప్రమాదాలపై హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధిలో జరిగిన ప్రమాదం తనను ఎంతగానో కలిచివేసిందన్నారు. అభం శుభం తెలియని ఐదేండ్ల బాలుడు టిప్పర్ చక్రాల కింద నలిగి దుర్మరణం చెందడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. బాబును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇటీవల వరుస రోడ్డు ప్రమాదాలతో అనేక మంది ప్రాణాలు కోల్పోతుండటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా పాఠశాల వేళల్లో భారీ వాహనాలను రోడ్లపైకి అనుమతించవద్దని, స్కూల్ జోన్ రూల్స్‌ను కఠినంగా అమలు చేయాలని విన్నవించారు. వ్యవస్థాగత వైఫల్యాలు, నిబంధనల అమలులో నిర్లక్ష్యమే ఇందుకు కారణమని విశ్లేషించారు. డ్రైవర్లకు శిక్షణ ఇవ్వాలని, మద్యం మత్తులో ఉన్నవారిపై కొరడా ఝళిపించాలని హరీశ్‌రావు కోరారు.