చిన్నకోడూరు, మే 9: “మూసీ, ఫ్యూచర్ సిటీ మీద ఉన్న ప్రేమ.. రేవంత్‌రెడ్డికి రైతుల మీద లేదు. సీఎం, మంత్రులు ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష చేయకపోవడం సిగ్గుచేటు.. రైతులకు గన్నీ బస్తాలు ఇవ్వడం లేదు.. ఏ గ్రేడు వడ్లకు.. బీ గ్రేడ్ ధర చెల్లించడం రైతులను మోసం చేయడమేనని, రైతుల ఆవేదన అర్థం చేసుకొని కొనుగోళ్లలో వేగం పెంచాలి” అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులోని అల్లిపూర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పొద్దుతిరుగుడు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఆయన సం దర్శించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాల వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరికోతల సమయంలోనే మంత్రులు, అధికారులతో మీటింగ్ పెట్టి సమీక్ష చేశారని గుర్తుచేశారు. నాడు రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట, చిన్నకోడూరు ప్రాంతంలో పొద్దుతిరుగుడు పండించే రైతులు అధికంగా ఉన్నారన్నారు. ఎకరానికి 9 నుంచి 10 క్వింటాళ్ల పంట పండితే ఆరున్నర క్వింటాళ్లు కొనుగోలు చేస్తామని నిబంధన పెట్టడం సరికాదన్నారు. కేంద్రం కొనుగోలు చేయడం లేదని సాకుగా చూపించి రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదన్నారు. వరి తగ్గించి, ఆరుతడి పంటలు పండించాలని చెప్పి పొద్దుతిరుగుడు కొనుగోలు చేయకపోవడం సరైంది కాదన్నారు. మూడు పంటలకు రైతు భరోసా ఎగ్గొట్టిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డికే దక్కిందన్నారు.

సంగారెడ్డి, కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో శనిగ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ప్రతి సంవత్సరం జొన్నలు కొనుగోలు చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం జొన్నలు, పొద్దుతిరుగుడు, మక్కలు కొనుగోలు చేసే పరిస్థితి లేదన్నారు. మకలు అమ్మే రైతులను సంచులు మీరే తెచ్చుకోవాలని చెప్పడం ప్రభుత్వానికి తగదన్నారు. ఏ గ్రేడ్ వడ్లకు బీ గ్రేడ్ ధర చెల్లించడం రైతులను ప్రభుత్వం మోసంచేయడమేనని మండిపడ్డారు. తూకం వేసేటప్పుడు తరుగు తీయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కొనుగోలు సెంటర్లను సందర్శించి రైతుల ఆవేదన అర్థం చేసుకోవాలని హితవుపలికారు. సిద్దిపేట, చిన్నకోడూరులో పొద్దుతిరుగుడు కొనుగోలు నిలిపివేసి నెల రోజులు దాటిందన్నారు.
కొనుగోళ్లు సక్రమంగా జరుగుతున్నాయని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. సిద్దిపేట మారెట్ యార్డుకు తాళం వేసి మూడు రోజులైందని, తాళం ఎందుకు వేశారని ప్రశ్నిస్తే గోదాముల్లో ధాన్యం పుషలంగా ఉందని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ, మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్, మాజీ ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి, అల్లిపూర్ సొసైటీ చైర్మన్ వెంకట్‌రెడ్డి, గంగాపూర్ సొసైటీ మాజీ చైర్మన్ కనకరాజు, ఉమ్మడి జిల్లా గొర్రెల పెంపకందారుల మాజీ చైర్మన్ పోచబోయిన శ్రీహరియాదవ్, మాజీ వైస్ ఎంపీపీ పాపయ్య, సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు ఉమేశ్‌చంద్ర, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జంగిటి పిన్నింటి అబ్బిరెడ్డి, శ్రీనివాస్ ముదిరాజ్, కొండం రవీందర్‌రెడ్డి, కాల్వ ఎల్లయ్య, బీఆర్ఎస్వీ నాయకుడు రఘు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.