హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): మెట్రో విస్తరణ, ఫేజ్-2 పనుల కోసం స్వాధీనం చేసుకునే అంశంపై గురువారం సభలో ప్రవేశపెట్టిన స్టేట్మెంట్పై సభలో తీవ్ర గందరగోళం నెలకొన్నది. ప్రభుత్వం తరఫున స్టేట్మెంట్ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఆ స్టేట్మెంట్పై కనీసం మాట్లాడేందుకు, తమ అభిప్రాయం చెప్పేందుకు కూడా ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వలేదు. దీంతో ప్రభుత్వ తీరును, సభను నిర్వహిస్తున్న వైనాన్ని బీఆర్ఎస్ ఎల్పీ సభ్యులూ, ఉపనేత హరీశ్‌రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ఏకగ్రీవ తీర్మానం కాదు.. ఏకపక్ష తీర్మానం అని హరీశ్‌రావు మండిపడ్డారు.
సభలో సీఎం తీర్మానాన్ని ప్రవేశపెడుతూ.. ‘విశాల ప్రజా ప్రయోజనాల దృష్ట్యా.. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్‌లో మెట్రో నెట్‌వర్క్‌ను విస్తరించాలనే వివిధ వర్గాల డిమాండ్ మేరకు.. మెట్రో విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు ఉన్న అడ్డంకులను, ఎదురవుతున్న సమస్యలను లోతుగా సమీక్షించింది. మెట్రో ఫేజ్-1 69 కిలోమీటర్ల మేరకు నిర్మాణం జరిగింది. ఫేజ్-2 (ఏ)లో 76.4 కిలోమీటర్లు, ఫేజ్-2 (బీ) 86.1 కి.మీల మేరా విస్తరణ ప్రతిపాదనలను కేంద్రానికి సమర్పించాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంలో ఫేజ్-2 ఏ, బీలను ప్రభుత్వ ప్రాజెక్టుగా చేపేట్టేందుకు ఎదురవుతున్న సాంకేతిక, చట్టపరమైన నిర్వహణ సమస్యలను దృష్టిలోకి తీసుకున్నాం.
కేంద్రం ప్రభుత్వం లేవనెత్తిన అంశాలను పరిష్కరించేందుకు, ఎల్ అండ్ టీ సంస్థ నుంచి మెట్రో ఫేజ్-1 నెట్‌వర్క్‌ను రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎంఆర్ఎల్ ద్వారా స్వాధీనం చేసుకునే నిర్ణయాన్ని ఈ సభ ఏకగ్రీవంగా ఆమోదించాలి’ అని కోరారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులు బల్లలు చరిచి ఆమోదం తెలుపగా.. సీఎం కృతజ్ఞతలు తెలిపారు. దానికి ప్రతిపక్షం అభిప్రాయాలు తీసుకోకుండానే ప్యానెల్ స్పీకర్ పరిగణలోకి తీసుకోవడం పట్ల బీఆర్ఎస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. ‘ఇక రెజుల్యేషన్ను ఏకగ్రీవంగా పాస్ చేయాలంటే.. మా అభిప్రాయం తీసుకోకుండా.. మీరే ఎలా పాస్ చేసుకుంటారు సార్. సభ్యులు అంగీకరించినందుకు ధన్యవాదాలు ఎలా చెప్తారు? ఇది రెజూల్యూషన్ పాస్ చేసుకోవడానికి ఇది సరైన పద్ధతి కాదు. మీరు స్టేట్మెంట్ మీద ఏకగ్రీవంగా స్టేట్మెంట్ పాస్ చేయాలనుకున్నప్పుడు ఇది ఏకగ్రీవ తీర్మానం కాదు.. ఏకపక్షంగా చేసుకున్న తీర్మానం. ఈ సభ నడుపుతున్న తీరుపట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం’ అని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
