సికింద్రాబాద్, జనవరి 17: బీసీ ఉద్యోగులపై జరుగుతున్న అగ్రకుల, ఆధిపత్య రాజకీయ నాయకుల ఆగడాలను అరికట్టాలని ఓబీసీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ డాక్టర్ అవ్వారు వేణు కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గంలో పుట్టి, తల్లిదండ్రుల వారసత్వంగా వచ్చిన ఆస్తులను అమ్ముకొని ఉద్యోగం సంపాదిస్తే ఆ ఉద్యోగానికి అడ్డంపడే నాయకులు కొందరు తయారవుతున్నారని, ఇది వెంటనే మానుకోకపోతే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు.
ఈ మధ్యన ఓ పోలీస్ ఉన్నతాధికారిని తీవ్ర ఒత్తిడికి గురిచేసి వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం సంతకాలు చేయించుకోవాలని బెదిరిస్తున్నారని, ఇలాంటి పోకడలు తెలంగాణ రాష్ట్రంలో ఇక కుదరవని అన్నారు. చిన్న ఉద్యోగం దగ్గర నుంచి మొదలుకొని ఉన్నత ఉద్యోగం చేస్తున్న బీసీ ఉద్యోగస్తులపై అగ్రకుల ఆధిపత్య పోరు కొనసాగుతుందని, నీతి నిజాయితీకి కట్టుబడి ఉంటూ చట్టానికి లోబడి ఉద్యోగం చేస్తుంటే.., చట్టాన్ని చుట్టంగా మలుచుకొని తమ వ్యక్తిగత ప్రయోజనాలు పొందాలని కొంత మంది రాజకీయ నాయకులు చూస్తున్నారని, ఇకపై వారిని సహించేది లేదన్నారు.
ప్రధానంగా నల్లగొండ జిల్లాలో రెడ్ల పెత్తనం బాగా పెరిగిపోయిందని బీసీ ఉద్యోగస్తులను ఒక ఆట బొమ్మలా చూస్తున్నారని, రాజకీయ నాయకులకు అనుకూలంగా పని చేయకపోతే బదిలీల పేరుతో, ఏదో ఒక కారణం చెప్పి మెమో జారీ చేస్తామని బెదిరించడం బాధాకరమన్నారు. బీసీ ఓట్లతో గెలిచి బీసీ ఉద్యోగస్తులను బెదిరిస్తే ఊరుకునేదే లేదని, రాబోయే రోజుల్లో బీసీ ప్రజానీకంతోని దెబ్బ కొడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు కోట్ల వాసుదేవ్, ఓబీసీ పొలిటికల్ జాక్ కన్వీనర్ ఎస్బీఎన్ చారి, మల్లేశ్ యాదవ్, సురేశ్, నరేశ్ గౌడ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.