జవహర్‌నగర్, మే 26: ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించకపోవడంలో ఆంతర్యమేమిటని మానవీయతను పాటించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ప్రజా సంఘాల నాయకులు దుయ్యబట్టారు. మావోయిస్టులు ఎన్కౌంటర్లో మరణించి ఐదు రోజులు గడుస్తున్న వారి కుటుంబాలకు మృతదేహాలను అప్పగించకపోవడాన్ని నిరసిస్తూ పీవోడబ్ల్యూ(విముక్తి) పెర్క సునీత ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల సమక్షంలో సోమవారం జవహర్‌నగర్ కార్పొరేషన్ అంబేద్కర్ చౌరస్తాలో నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోర్టులు మృతదేహాలను అప్పగించాలని ఆర్డర్లు ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం సొంత రాజ్యాంగాన్ని నడిపిస్తుండటం దుర్మార్గమన్నారు. మార్చురీలో మృతదేహాలు కుళ్లిపోతున్నాయని, కనీస సౌకర్యాలు కల్పించలేని దుస్థితిలో ప్రభుత్వాలు ఉండటం సిగ్గుచేటని అన్నారు. ఆపరేషన్ కగార్‌ను ఎత్తి వేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఇష్టు జాతీయ కన్వీనర్ షేక్షావలి, ఎస్కే మీరా, యాదగిరి, శివన్నారాయణ , యాకస్వామి, సావిత్రీ, పాషామియా, సింగరయ్యగౌడ్, మల్లిక తదితరులు పాల్గొన్నారు.
సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో..
చిక్కడపల్లి : ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను వెంటనే వారి కుటుంబ సభ్యులకు అప్పజెప్పాలని ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అధ్యక్ష కార్యదర్శులు గడ్డం లక్ష్మణ్ , నారాయణరావు మాట్లాడారు. వేదిక ఆధ్వర్యంలో ప్రజా సంఘాలతో కలిసి మృతదేహాలను కుటుంబ సభ్యులకు ఇప్పించే బాధ్యత తీసుకోవాలని వివిధ రాజకీయ నాయకులకు వినతి పత్రాలు ఇచ్చామని తెలిపారు. మృతదేహాలు అప్పజెప్పకపోవడం శోచనీయమన్నారు. సమావేశంలో నాయకులు చంద్రమౌళి వెంకటయ్య, శ్రావణ్ బల్ల రవి,భవానీ తదితరులు పాల్గొన్నారు.