HCU | కొండాపూర్, మే 24 : డిజిటల్ ట్విన్ టెక్నాలజీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ( సీవోఈ) ఏర్పాటు కోసం గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రూ.5 కోట్ల గ్రాంట్‌ను మంజూరు చేసింది. హెచ్ఏఎల్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా అందజేస్తున్న నిధులతో వర్సిటీలో పరిశోధన, ఆవిష్కరణ సామర్థ్యాలకు పెద్ద ఎత్తున మేలు జరుగుతుందని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బీజే రావు అన్నారు. ఈ ప్రతిపాదనకు నాయకత్వం వహిస్తున్న ప్రొఫెసర్లు సామ్రాట్ సబత్, సిబ ఉద్గాట, ఘనశ్యాం కృష్ణల కృషి వల్లే గ్రాంట్ మంజూరైనట్లు తెలిపారు. సీఎస్ఆర్ నిధులను సమగ్ర పరిశోధన మౌలిక సదుపాయాల ఏర్పాటుకు వినియోగిస్తామన్నారు. అత్యాధునిక డిజిటల్ ట్విన్ ల్యాబ్ ప్రాక్టిక్స్ డెవలప్మెంట్ కోసం శిక్షణ లాబ్స్, విద్యార్థులు, పరిశోధకుల నైపుణ్యాలు పెంపొందించే లక్ష్యంతో నిరంతర శిక్షణ, వర్క్ షాపులు నిర్వహించేందుకు ఆడిటోరియం నిర్మించనున్నట్లు తెలిపారు.