సిటీబ్యూరో: హెచ్-సిటీ ప్రాజెక్ట్ పనులను వేగంగా పూర్తి చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ అధికారులకు సూచించారు. గురువారం ఎన్ఐయూఎంలో హెచ్-సిటీలో భాగంగా రూ. 3500 కోట్లతో చేపట్టనున్న 38 రోడ్డు అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులు, రూ.150 కోట్లతో చేపట్టనున్న జంక్షన్ అభివృద్ధి సుందరీకరణ పనులను వేగంగా ప్రారంభించి, పూర్తి చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు ముఖ్య కార్యదర్శి దిశానిర్దేశం చేశారు.
రూ.1230 కోట్లతో చేపట్టే కేబీఆర్ పార్క్ చుట్టూ ఆరు జంక్షన్లలో ఫ్లై ఓవర్లు అండర్‌పాస్‌ల నిర్మాణానికి టెండర్ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలన్నారు. 125 ట్రాఫిక్ జంక్షన్లలో అడ్డుగా ఉన్న 4100 విద్యుత్ పోల్స్‌ను 3 నెలల్లోగా తరలించి జంక్షన్ల అభివృద్ధి, సుందరీకరణ పనులు చేపట్టాలని దానకిశోర్ చెప్పారు. కాగా, విరించి జంక్షన్,పెన్షన్ ఆఫీస్ లింక్ రోడ్డును క్షేత్రస్థాయిలో బల్దియా కమిషనర్ ఇలంబర్తి, ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ విశ్వప్రసాద్‌తో కలిసి దానకిశోర్ పరిశీలించారు. ట్రాఫిక్ ఇబ్బందులను దూరం చేసేందుకు విరించి రోడ్డు వద్ద రోడ్డు విస్తరణ, అభివృద్ధితో పాటు సుందరీకరణ పనులు చేపట్టాలన్నారు.