శేరిలింగంపల్లి, నవంబర్ 4: రాయదుర్గం పరిధిలోని మణికొండ పంచవటి కాలనీలో కాల్పులు జరిగాయన్న ప్రచారంలో వాస్తవంలేదని ఇన్స్పెక్టర్ సీహెచ్.వెంకన్న తెలిపారు. ‘పంచవటికాలనీలో కాల్పుల కలకలం అంటూ’ మంగళవారం సాయంత్రం వైరల్‌గా మారిన నేపథ్యంలో ఆయన మీడియాకు వివరణ ఇచ్చారు. ఏపీ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేఈ ప్రభాకర్ కూతురుకు పటాన్చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు అభిషేక్ గౌడ్‌తో 2011లో వివాహం జరిగిందని, అల్లుడు, కూతురు ఉండేందుకు ప్రభాకర్ మణికొండ పంచవటికాలనీలోని తన ఇంటిని వారికి ఇచ్చారు.
మూడేండ్ల అనంతరం దంపతులిద్దరూ వేరే ప్రాంతానికి వెళ్లిపోగా.. మామ ఆ ఇల్లును అభిషేక్ గౌడ్ కృష్ణ ధర్మ పరిషత్ కార్యాలయం కోసం ఇచ్చారు. కృష్ణ ధర్మ పరిషత్ ఆలిండియా ప్రధాన కార్యదర్శి రాముయాదవ్, అభిషేక్ గౌడ్ మేనమామ వెంకటేశ్ గౌడ్లు దాదాపు కోటిన్నర ఖర్చు చేసి ఇంటీరియల్ పనులు చేయించారు. రెండు నెలల కిందట కృష్ణ ధర్మ పరిషత్ కార్యాలయాన్ని కేఈ ప్రభాకర్‌కు అప్పగించారు. దీంతో కార్యాలయ ఇంటీరియల్ పనుల కోసం తాము వెచ్చించిన డబ్బులు ఇవ్వాలని అడగగా.. నాకు సంబంధంలేదని ప్రభాకర్ తేల్చి చెప్పారు. అయితే అక్టోబర్ 24న రాముయాదవ్, వెంకటేష్ గౌడ్లు సదరు ఇంటికి తాళం వేశారు.
దీంతో ప్రభాకర్ ఇచ్చిన ఫిర్యాదుతో 25న రాముయాదవ్, వెంకటేష్ గౌడ్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరుసటి రోజు ప్రభాకర్ పంచవటి కాలనీలోని ఇంట్లో ఉన్న సమయంలో రాము యాదవ్, వెంకటేశ్ గౌడ్లు మరికొందరితో అక్కడికి వెళ్లారు. ఇంటీరియల్ డబ్బుల విషయంలో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. విషయం తెలుసుకున్న రాయదుర్గం పోలీసులు వెళ్లి అక్కడి నుంచి పంపించివేశారు. ఇదిలాఉండగా.. అదేరోజు రాత్రి కేఈ ప్రభాకర్, రాము యాదవ్‌లు పరస్పరం తుపాకీతో బెదిరించారని ఫిర్యాదులు చేశారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించగా.. ఇరువురి వద్ద ఎలాంటి తుపాకీలు, గన్లు లేవని తేలడంతో కేసులు నమోదు చేయలేదని, విచారణ జరుగుతుందని, అలాంటివి ఏవైనా లభిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ సీహెచ్.వెంకన్న తెలిపారు.