e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 19, 2021
Home హైదరాబాద్‌ గులాబ్‌ కష్టం.. క్షణాల్లో మాయం

గులాబ్‌ కష్టం.. క్షణాల్లో మాయం

ఖైరతాబాద్‌- పంజాగుట్ట ప్రధాన రహదారిలో ఉన్న ఎర్రమంజిల్‌ చౌరస్తా ఇది. సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి పెద్ద ఎత్తున ఎగువ నుంచి వరద కేసీపీ జంక్షన్‌ వద్ద నిలిచిపోయింది. వాహనాల రాకపోకలకు కష్టంగా మారింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన జీహెచ్‌ఎంసీ బృందాలు కేవలం 25 నిమిషాల్లోనే వరద నీటిని తొలగించి క్షణాల్లో ముంపును మాయం చేశారు. ఇక్కడే కాదు నగర వ్యాప్తంగా ప్రధాన రహదారుల పొడవునా ఎక్కడ నీరు నిలిచినా జీహెచ్‌ఎంసీ- పోలీసు బృందాలు క్షణాల్లో రంగంలోకి దిగి వరద నీటిని ఎప్పటికప్పుడు పంపించివేస్తున్నారు.

‘గులాబ్‌’ ప్రభావంతో గ్రేటర్‌లో వర్షం కురుస్తూనే ఉంది. ఆదివారం రాత్రి నుంచే ఎడతెరిపి లేకుండా పడుతోంది. ఏకధాటి వర్షానికి ప్రధాన రహదారులు చెరువులయ్యాయి. మ్యాన్‌హోళ్లు, నాలాలు పొంగిపొర్లుతున్నాయి. శివారుల్లోని చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. ఎగువ నుంచి వచ్చిన వరదతో జంట జలాశయాలు మరోసారి నిండుకుండల్లా మారాయి. భారీ వరద లోతట్టు ప్రాంతాలను ముంచెత్తగా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

- Advertisement -

క్షేత్రస్థాయిలో 170 మాన్‌సూన్‌, 92 స్టాటిస్టిక్స్‌ బృందాలు రంగంలోకి దిగి ఎప్పటికప్పుడు వరదనీటిని తొలగిస్తున్నాయి. ముంపు ప్రాంత వాసుల కోసం 30 పునరావాస కేంద్రాలను జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసింది. ఎస్‌ఎఫ్‌ఏ జవాను నుంచి జోనల్‌ కమిషనర్‌ స్థాయి అధికారి వరకు 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ చర్యలు చేపట్టారు. అత్యవసరం అయితే తప్ప బయటికి ఎవరూ రావొద్దని మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి కోరారు. మరోవైపు 28,29 తేదీల్లో జరగాల్సిన వివిధ పరీక్షలను ఓయూ, జేఎన్‌టీయూ రద్దు చేశాయి.

పునరావాస కేంద్రాలు 30 ఏర్పాటు

లోతట్టు ప్రాంత ప్రజల కోసం 30 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి తెలిపారు. అవసరమైతే వాటి సంఖ్యను పెంచేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కంట్రోల్‌ రూంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కురుస్తున్న భారీ వర్షాలకు ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎస్‌ఎఫ్‌ఏ జవాన్‌ నుంచి జోనల్‌ కమిషనర్‌ స్థాయి అధికారులు 24 గంటలు పని చేస్తారని అన్నారు.

040- 21111111

జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో 040- 21111111 హెల్ప్‌ లైన్‌ నంబర్‌ను ఏర్పాటు చేసిన అధికారులు 24 గంటల పాటు పని చేసేలా సిబ్బందిని నియమించారు. సాయం కావాలని ఎవరైనా హెల్ప్‌లైన్‌ నంబర్‌ను సంప్రదిస్తే వెంటనే అధికారులు రంగంలోకి దిగుతారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల్లో నీటిని తొలగించేందుకు 202 మోటార్లను ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రం కంట్రోల్‌ రూమ్‌కు 312 ఫిర్యాదులు రాగా అందులో 297 సమస్యలను పరిష్కరించారు.

విస్తృత పర్యటన..

భారీ వర్షాలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకొని.. తక్షణమే పరిష్కరించేందుకు డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలతా శోభన్‌రెడ్డి పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఫీవర్‌ వైద్యశాల వద్ద హుస్సేన్‌సాగర్‌ నాలాను పరిశీలించిన ఆమె అనంతరం తార్నాక డివిజన్‌ నఫీన్‌ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని తనిఖీ చేశారు.

ఆస్తి, ప్రాణ నష్టం జరగొద్దు

అధికారులు అప్రమత్తంగా ఉండి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూడాలని మున్సిపల్‌ పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ అన్నారు. సోమవారం సాయంత్రం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, జోనల్‌ కమిషనర్లు, మున్సిపల్‌ డైరెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని.. మొబైల్‌ అన్నపూర్ణ కేంద్రాలను ఏర్పాటు చేసి రాత్రిపూట భోజన సదుపాయం కల్పించాలన్నారు.

విద్యుత్‌ సమస్యలా.. 1912

ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కోవడంతో పాటు నిరంతరంగా విద్యుత్‌ను సరఫరా చేసేందుకు స్కాడాలో ప్రత్యేక కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేసినట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ సీఎండీ జి.రఘుమారెడ్డి తెలిపారు. సోమవారం విద్యుత్‌ సరఫరాపై ఆయన సమీక్ష నిర్వహించారు. విద్యుత్‌ సమస్యలపై 1912తో పాటు 7382072104, 7382072106, 7382071574 నంబర్లలో ఫిర్యాదు చేయవచ్చన్నారు.

గ్రేటర్‌లో దాదాపు 2000 మందితో కూడిన డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ బృందాలు పని చేస్తున్నాయని అన్నారు. అపార్ట్‌మెంట్‌, సెల్లార్లలో నీరు చేరి విద్యుత్‌ ప్యానల్‌ బోర్డులతో పాటు ఇతర విద్యుత్‌ పరికరాలు మునిగే అవకాశం ఉన్నందున అపార్ట్‌మెంట్‌ వాసులు జాగ్రత్తగా ఉండాలన్నారు. స్కాడా నుంచి ముగ్గురు చీఫ్‌ జనరల్‌ మేనేజర్లు, ఆపరేషన్‌ సర్కిల్‌ సూపరింటెండెంట్‌ ఇంజినీర్లతో సమన్వయం చేసుకుంటూ విద్యుత్‌ సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తారని సీఎండీ తెలిపారు.

మ్యాన్‌ హోళ్ల్లా.. 155313

భారీగా కురుస్తున్న వర్షాలతో ముందస్తు చర్యలు చేపట్టామని.. ఇప్పటికే 16 ఈఆర్‌టీ బృందాలను ఏర్పాటు చేసినట్లు జలమండలి ఎండీ దానకిశోర్‌ తెలిపారు. ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సీవరేజి ఓవర్‌ ఫ్లో అయ్యే ప్రాంతాలను గుర్తించాలన్నారు. అత్యవసర పరిస్థితి తలెత్తితే వెంటనే పరిష్కరించేందుకు 16 ఎయిర్‌ టెక్‌ మిషన్లను అందుబాటులో ఉంచాలన్నారు. గ్రేటర్‌లో దాదాపుగా 22 వేల మ్యాన్‌హోళ్లకు సేఫ్టీగ్రిల్స్‌ ఏర్పాటు చేశామని.. ఎక్కడైనా మ్యాన్‌హోల్‌ ధ్వంసం లేదా మూత తెరిచి ఉన్నా జలమండలి కస్టమర్‌ కేర్‌ నంబర్‌ 155313కి ఫోన్‌ చేయాలన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement