కాచిగూడ, మే 28: బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం డిమాండ్ చేశారు. బుధవారం కాచిగూడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం 42 శాతానికి బీసీ రిజర్వేషన్లు పెంచుతూ జీవో జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, 73, 74 వ రాజ్యాంగ సవరణ చేసినప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 డి6 ప్రకారం స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని సూచించారు. ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లను పెంచకుండా ఎన్నికలు నిర్వహించడానికి సన్నాహకాలు చేస్తుందని, అదే జరిగితే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం పార్టీ పరంగా 42 శాతం టికెట్లు ఇస్తామని ప్రకటిస్తుందని, ఆ టికెట్లు వద్దు…ఆ బిక్షం వద్దు బీసీలకు హక్కులు కావాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల విషయం పూర్తిగా పరిష్కారం కాలేదని, పరిష్కారం కాకుండా ఎన్నికలకు వెళితే బీసీలంతా కలిసి ఎన్నికలను అడ్డుకుంటామని హెచ్చరించారు.