సిటీబ్యూరో, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): ఓ పదేళ్లుగా రూపుమాసిపోయిన గుడుంబా రక్కసి నగరంలోకి మళ్లీ ప్రవేశించింది. ఎంతోమంది అమాయకులను బలిగొని ఎన్నో వేల కుటుంబాలను రోడ్డున పడేసిన ఈ మత్తు మహమ్మారిని కేసీఆర్ సర్కారు సంపూర్ణంగా పారదోలితే కాంగ్రెస్ పాలనలో అది మళ్లీ నగరంలోకి ప్రవేశించింది. గురువారం నానక్‌రామ్‌గూడలో పట్టుబడిన గుడుంబా కేసుతో ధూల్‌పేటలో మళ్లి గుడుంబా బట్టీలు వెలిసినట్లు తెలుస్తోంది.
శేరిలింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని నానక్‌రామ్‌గూడలో గత కొన్ని రోజులుగా గుడుంబా విక్రయాలు జరుగుతున్నాయి. ఈ మేరకు సమాచారం అందుకున్న శంషాబాద్ డీటీఎఫ్ పోలీసులు ఈనెల 8న గుడుంబా విక్రయాలకు పాల్పడుతున్న రేఖాబాయి, కిషన్‌సింగ్‌లను అదుపులోకి తీసుకుని విచారించారు. ధూల్‌పేటకు చెందిన రాధికాబాయి, శంకర్ల వద్ద లీటర్‌కు రూ.400 చొప్పున కొనుగోలు చేసి, నానక్‌రామ్‌గూడలో అమ్ముతున్నట్లు తేలింది.
దీంతో కిషన్‌సింగ్, రేఖాబాయిలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 10 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో ధూల్‌పేటలో మళ్లీ గుడుంబా తయారీ జరుగుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. శంషాబాద్ డీటీఎఫ్ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఆబ్కారీ పోలీసులు కిషన్‌సింగ్, రేఖాబాయిలపై కేసు నమోదు చేసినట్లు ధూల్‌పేట ఎక్సైజ్ సీఐ మధుబాబు తెలిపారు.
ఉక్కుపాదం మోపి…
ధూల్‌పేట.. ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది గుడుంబా తయారీ. గుడుంబాను నిర్మూలించడం 2016 వరకు అప్పటి వరకు ఉన్న ఏ ప్రభుత్వానికీ సాధ్యపడలేదు. ధూల్‌పేటలో తయారయ్యే గుడంబా రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు సరఫరా జరిగేది. దీని వల్ల నగరంలో శాంతిభద్రతల సమస్యతో పాటు ఎంతో మంది అమాయకులు ఈ గుడంబా మహమ్మారికి బలయ్యేవారు. ధూల్‌పేట ప్రాంతంలో చాలా మంది మహిళలు యుక్త వయస్సులోనే వితంతువులుగా మారేవారు. దీనిపై తీవ్రంగా స్పంధించిన నాటి కేసీఆర్ సర్కార్ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ధూల్‌పేటపై దృష్టి సారించిన విషయం తెలిసిందే.
అప్పట్లో రా్రత్రింబవళ్లు శ్రమించి..
నగరాన్ని గుడుంబా రహిత రాజధానిగా మార్చాలంటే ముందు ధూల్‌పేటలో గుడుంబా తయ్యారీని పూర్తిగా రూపుమాపాలనే దృఢ సంకల్పంతో 2015నుంచి 2016 వరకు సంవత్సర కాలం పాటు గుడుంబా యుద్ధమే చేసిన విషయం తెలిసిందే. పోలీసులు, ఆబ్కారీ అధికారులు కలిసి రాత్రింబవళ్లు ప్రాణాలకు సైతం తెగించి గుడుంబా వ్యాపారులను పట్టుకుని కటకటాల్లోకి నెట్టడమే కాకుండా గుడుంబా తయారీదారులు, వ్యాపారుల కుటుంబాలను గుర్తించి వారికి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడం, లోన్లు ఇవ్వడం తదితర చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. 2016, అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు హైదరాబాద్ జిల్లాను గుడుంబా రహిత జిల్లాగా నాటి బీఆర్ఎస్ సర్కార్ ప్రకటించింది. కానీ పదేండ్ల తర్వాత మళ్లీ గుడుంబా బట్టీలు వెలియడం అటు అధికారులను విస్మయపరిస్తే ఇటు నగరవాసులను కలవర పెడుతున్నది.