Family Planning Operations | జూబ్లీహిల్స్, ఫిబ్రవరి 15: కుటుంబ నియంత్రణపై వైద్యశాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో జననాల వృద్ధి రేటు భారీగా పెరుగుతున్నది. వలస జీవులతో నిండిపోతున్న హైదరాబాద్ మహా నగరంలో జనాభా పెరుగుదల పెద్ద సమస్యగా మారనున్నది. తెలంగాణ ప్రభుత్వ హయాంలో మూడు నెలలకోసారి నిర్వహించిన కుటుంబ నియంత్రణ శిబిరాలు కొత్త ప్రభుత్వం వచ్చాక అడ్రస్ లేకుండా పోయాయి. దీంతో కుటుంబ నియంత్రణపై నియంత్రణ లేకపోవడంతో ప్రసవాల రేటు పెరిగిపోతున్నది. శ్రీరామ్ నగర్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో రెండు రోజుల క్రితం ఒక మహిళ ఆడపిల్లకు జన్మనిచ్చింది. సదరు మహిళకు ఇప్పటికే ఇద్దరు మగ పిల్లలు, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. ఒక అబార్షన్ కూడా కావడంతో ఆమెను ఆరు సార్లు గర్భాన్ని ధరించిన (జీ 6) మహిళగా గుర్తించారు.
శ్రీరామ్ నగర్ సీహెచ్సీలో గత నెల ఆరో తేదీన మరో మహిళ ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అప్పటికే ఆ మహిళకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. గతంలో ఒక బిడ్డ చనిపోవడం, మరొక గర్భం పోవడంతో సదరు మహిళను కూడా గ్రావిడ్ -6 గా పరిగణించారు. ఇలా నగరం లోని ప్రసూతి దవాఖానలకు ఇద్దరి కంటే ఎక్కువగా పిల్లలు ఉన్న తల్లులు ప్రసవాల కోసం వస్తున్నారు. అయితే వైద్యఆరోగ్యశాఖలో గత కొంత కాలంగా కుటుంబ నియంత్రణ శిబిరాలు నిర్వహించి కుటుంబ నియత్రణ ఆపరేషన్లు చేయడం లేదు. దీంతో పెద్ద ఎత్తున జనాభా పెరిగిపోయే ప్రమాదం పొంచి ఉందని సామాజిక వేత్తలు చెబుతున్నారు.