సిటీబ్యూరో, నవంబర్ 16(నమస్తే తెలంగాణ): గ్రూప్-3 పరీక్షకు అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శనివారం సూచించారు. పరీక్ష ప్రశాంతంగా నిర్వహించేల అన్నీ ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. జిల్లాలో 102 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఆదివారం జరిగే పరీక్షలు ఉదయం 8:30 గంటలకు అభ్యర్థులు సెంటర్లకు చేరుకోవాలని, మధ్యాహ్నం నిర్వహించే పరీక్షకు 1:30 గంటలకు చేరుకోవాలని సూచించారు. పరీక్ష సమయం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరుగుతుందని పేర్కొన్నారు. హాల్ టికెట్, ఒరిజినల్ ఐడీ గుర్తింపు కార్డులు తప్పకుండా తీసుకురావాలని పేర్కొన్నారు. ట్రాఫిక్ దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ సూచించారు. 45,918 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్టు వివరించారు.
గ్రూప్-3 పరీక్షల నేపథ్యంలో సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఈ నెల 16వ తేదీ నుంచి 17 వరకు రెండు రోజుల పాటు 144 సెక్షన్ విధిస్తూ కమిషనర్లు అవినాష్ మహంతి, సుధీర్‌బాబు ఆదేశాలు జారీ చేశారు. పరీక్షా కేంద్రాల చుట్టూ 200 మీటర్ల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఆంక్షలు అమలులో ఉన్న ప్రాంతంలో ఐదుగురు లేదా అంత కంటే ఎక్కువ మంది గుమికూడటం, ర్యాలీలు, ఊరేగింపులు, ధర్నాలు, రాస్తారోకోలు వంటి నిరసన కార్యక్రమాలు చేపట్టడం నిషేధమని, పరీక్షా కేంద్రాల నుంచి 100 మీటర్ల దూరంలో ఉన్న జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ సెంటర్లు, ఫొటో స్టూడియోలను మూసివేస్తున్నట్లు తెలిపారు. ఈ ఆంక్షలు నేటి ఉదయం 10 గంటల నుంచి 18వ తేదీ సాయంత్రం 5.30 గంటల వరకు అమలులో ఉంటాయన్నారు.
గ్రూప్-3 పరీక్షల దృష్ట్యా అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా నగరంలో ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచునున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. పరీక్షల సమయాలకు అనుగుణంగా 102 పరీక్ష కేంద్రాలను దృష్టిలో పెట్టుకుని వివిధ ప్రాంతాల నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయని వివరించారు. కోఠి, రెతిఫైల్లో కమ్యూనికేషన్ సెంటర్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్దకు వెళ్లే బస్సుల సమాచారం కోసం ఫోన్ నం. 99592 26160, 99592 26154లలో సంప్రదించి తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. నేడు, రేపు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.