సిటీబ్యూరో, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): నగర శివారులోని మొయినాబాద్‌లో కొన్ని ‘గ్రూప్-2’ పరీక్షా కేంద్రాలు అభ్యర్థుల పాలిట శాపంగా మారాయి. ఆ కేంద్రాల్లో పరీక్షలు రాయాలంటే అభ్యర్థులు, వారి వెంట వచ్చిన కుటుంబసభ్యులు అర కిలోమీటరుకు పైగా నడవాల్సిందే. సొంత వాహనాలున్నా, క్యాబ్‌లో వచ్చినా అరకిలో మీటరు దూరంలోనే వాహనాలను పార్క్ చేసి పరీక్షా కేంద్రాలకు నడుచుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి. ఇది ఎక్కడో మారుమూల గ్రామంలో అనుకుంటే పొరపాటే. మహానగరానికి ఆనుకుని ఉన్న మొయినాబాద్‌లోని కేజీ రెడ్డి, గ్లోబల్ ఇంజినీరింగ్ కళాశాల గ్రూప్-2 ఎగ్జామ్ సెంటర్లలో నెలకొన్న దుస్థితి. వివరాల్లోకి వెళితే… మొయినాబాద్‌లోని కెజి.రెడ్డి, గ్లోబల్ ఇంజినీరింగ్ కళాశాలల్లో గ్రూప్-2 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో ఆదివారం గ్రూప్-2 పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థుల వాహనాలకు సరైన పార్కింగ్ స్థలంలేదని పోలీసులు పరీక్షా కేంద్రానికి అరకిలో మీటరుకు పైగా దూరంలోనే పార్క్ ఏర్పాటు చేయించారు. దీంతో పరీక్ష రాసే అభ్యర్థులు, వారి వెంట వచ్చిన కుటుంబసభ్యులు గత్యంతరం లేక దాదాపు 700 మీటర్ల దూరంలోనే వాహనాలను పార్క్‌చేసి కాలినడకన పరీక్షా కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చిందని అభ్యర్థులు, వారి కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక నిమిషం ఆలస్యమైతే పరీక్షా కేంద్రంలోకి అనుమతించమని ఒక పక్క టీజీపీఎస్సీ అధికారులు నిబంధనలు విధిస్తుండగా.. మరో పక్క పోలీసులు అభ్యర్థుల వాహనాలను పరీక్షా కేంద్రానికి అరకిలోమీటర్ దూరంలోనే నిలిపి వేయడమేంటని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.
వాహనాలు పార్క్ చేసిన ప్రాంతం నుంచి పరీక్షా కేంద్రానికి కాలినడకన చేరుకునేందుకు దాదాపు 10 నిమిషాల సమయం పడుతుందని, దీని వల్ల వివిధ కారణాలతో చివరి నిమిషంలో పరీక్షా కేంద్రానికి చేరుకునే అభ్యర్థులు ‘నిమిషం నిబంధన’కు బలై సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోలేని పరిస్థితి లేకపోలేదని, గతంలో అక్కడ జరిగిన పలు పోటీ పరీక్షలు, టీజీపీఎస్సీ పరీక్షలు రాసిన పలువురు అభ్యర్థులు ఈ అరకిలోమీటర్ నడక కారణంగా సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోలేని సందర్భాలున్నట్లు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.
పార్కింగ్‌లేని కేంద్రాలు ఎందుకు?
గ్రూప్-1, గ్రూప్-2 వంటి పరీక్షా కేంద్రాలకు పరీక్షలు రాసే అభ్యర్థులు దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఇందులో భాగంగా చాలా మంది అభ్యర్థులు సొంత వాహనాలపై చేరుకోగా మరికొందరు క్యాబ్‌లు, ఆటోల్లో వస్తారు. అయితే పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థులకు సరైన పార్కింగ్ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత అటు సెంటర్ నిర్వాహకులు, టీజీపీఎస్సీ అధికారులు, పోలీసులపైన ఉంటుంది. కానీ అధికారుల మధ్య కొరవడిన సమన్వయ లోపం వల్ల గత కొంత కాలంగా పార్కింగ్ సౌలభ్యం లేని కేజీ.రెడ్డి, గ్లోబల్ ఇంజినీరింగ్ కళాశాలల్లో గ్రూప్-1, గ్రూప్-2 వంటి ప్రతిష్టాత్మకమైన పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, పార్కింగ్ స్థలంలేని కళాశాలల్లో ఎగ్జామ్ సెంటర్లను ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని అభ్యర్థులు, వారి కుటుంబసభ్యులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్థలం లేకనే దూరంగా పార్కింగ్
కెజి.రెడ్డి, గ్లోబల్ ఇంజినీరింగ్ కళాశాలలు ఇరుకైన సందులో ఉండటం, అక్కడ సరైన పార్కింగ్ స్థలం లేకపోవడం వల్లనే వాహనాలను కొంత దూరంలో పార్కింగ్ చేయిస్తున్నాం. ఈ రెండు పరీక్షా కేంద్రాలు ఇరుకైన సందులో ఉండటం, అక్కడ పార్కింగ్ స్థలం లేకపోవడంతో అభ్యర్థులందరూ ఒక్కసారిగా వాహనాలతో వస్తే తీవ్ర ట్రాఫిక్‌జామ్ ఏర్పడే అవకాశముంది. దీంతో అభ్యర్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోలేరు. అందుకని వారికి ట్రాఫిక్ ఆటంకాలు ఏర్పడకూడదనే అభ్యర్థుల వాహనాలను పరీక్షా కేంద్రాలకు కొంత దూరంలోనే నిలిపివేస్తున్నాం. పరీక్షకు గంట ముందుగా వచ్చిన అభ్యర్థుల వాహనాలను మాత్రమే దూరంగా పార్క్ చేయిస్తున్నాం.. ఆలస్యంగా వచ్చిన అభ్యర్థుల వాహనాలను మాత్రం పరీక్షా కేంద్రం వరకు అనుమతిస్తున్నాం. అవసరమైతే స్వయంగా తమ సిబ్బందితో పోలీసు వాహనాల్లో పరీక్షా కేంద్రాలకు చేరవేసేలా చర్యలు చేపట్టాం. రాజేంద్రనగర్ జోన్ పరిధిలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో ఆదివారం గ్రూప్-2 పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఉదయం నుంచి నేను స్వయంగా పరీక్షా కేంద్రాలను సందర్శించి, అభ్యర్థులకు ఇబ్బందులు కలుగకుండా పర్యవేక్షించాను. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద సంబంధిత ఠాణాకు చెందిన సీఐ, ఎస్ఐ స్థాయి అధికారులు బందోబస్తు చర్యలు నిర్వహిస్తున్నారు.
– డీసీపీ చింతమనేని శ్రీనివాస్