హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎండలు గరిష్ఠ స్థాయికి చేరడంతోపాటు నీటి వాడకం భారీగా పెరగడంతో చెరువులు, వాగులు, కుంటలు అడుగంటుతున్నాయి. భారీ జలాశయాల్లో నీటి నిల్వలు ఆవిరైపోతున్నాయి. దీంతో ఈ ప్రభావం భూగర్భ జలాలపై పడుతున్నదని భూగర్భ జలవనరుల నిపుణులు పేర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చివరి దశలో ఉన్న పంటలను రక్షించేందుకు పాతాళగంగను మరింతగా తోడేందుకు రైతులు కొత్త బోర్లను వేస్తుండటంతో పరిస్థితులు ఇంకా దారుణంగా మారుతున్నాయి.
రాష్ట్ర సగటు నీటిమట్టం 9.91 మీటర్లు
భూగర్భ జలవనరుల శాఖ నివేదికను పరిశీలిస్తే మార్చి నెలలో రాష్ట్ర సగటు నీటిమట్టం 9.91 మీటర్ల వద్ద నమోదైంది. నిరుడు మార్చిలో సగటు నీటిమట్టం 9.69 మీటర్ల వద్ద ఉంది. ఆ తర్వాత ఆగస్టు చివర్లో కుంభవృష్టి కురవడంతో రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలమట్టం ఆగస్టులో 6.84 మీటర్లు, సెప్టెంబర్లో 5.31 మీటర్లు, అక్టోబర్లో 5.38 మీటర్లు, నబంబర్లో 6.05, డిసెంబర్లో 6.72 మీటర్లుకు పెరిగింది. అక్టోబరు నుంచి వర్షాలు సన్నగిల్లడంతో క్రమేపీ నెలనెలా భూగర్భ జలమట్టం పడిపోతూ వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్లో క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో అక్కడక్కడ అడపాదడపా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయినా వాటి కారణంగా భూగర్భ జలాలు పెరగవని నిపుణులు చెబుతున్నారు.
వేగంగా అడుగంటుతున్న భూగర్భ జలాలు..
వేసవి తీవ్రతతో రాష్ట్రంలో భూగర్భ జలాలు వేగంగా అడుగంటుతున్నాయి. భూపాలపల్లి జిల్లాలో భూగర్భ జలాలు వేగంగా అడుగంటుతున్నట్టు భూగర్భ జలవనరుల శాఖ గుర్తించింది. ఫిబ్రవరితో పోల్చితే మార్చిలో ఏకంగా 6.24 మీటర్ల లోతుకు పడిపోయింది. సంగారెడ్డిలో 2.34, సిద్దిపేట జిల్లాలో 2.62, మేడ్చల్ మలాజిగిరిలో 2.15, యాదాద్రి భువనగిరిలో 2.11 మీటర్ల లోతుకు చేరుకుంది. ము లుగు, మెదక్, నిజామాబా ద్, కామారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, జనగామ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ నీటి తోడకం అధికంగానే ఉన్నట్టు నిపుణులు పేర్కొంటున్నారు.
నెల : రాష్ట్ర సగటు నీటిమట్టం (మీటర్లలో)
2025 మార్చి : 9.91
ఫిబ్రవరి : 8.68
జనవరి : 7.46
2024 డిసెంబరు: 6.72
నవంబరు : 6.05
అక్టోబరు : 5.38
సెప్టెంబరు : 5.31
ఆగస్టు : 6.84