ఖైరతాబాద్: సర్కారు భూమికి పట్టాలిచ్చిన అధికారులు, కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రీన్ ఫీల్డ్ కాలనీ వాసులు డిమాండ్ చేశారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాలనీ వాసులు శ్రీనివాస్‌రెడ్డి, గురువారెడ్డి, జీవీవీఎస్ మూర్తి మాట్లాడారు.
అల్వాల్ మండలం కానోజిగూడలో సర్వే నంబర్లు 373, 375, 376, 378, 379, 381, 386లలో 62.16 గుంటల భూమిని ఇనామ్దార్గా ఉన్న సయ్యద్ అక్బర్ నిజాముద్దీన్ హుస్సేన్ నివాస స్థలాలుగా మార్చి.. 1985 నుంచి 1992 వరకు ప్రైవేట్, ప్రభుత్వ రంగ ఉద్యోగులకు విక్రయించారన్నారు. ఈ స్థలాలను అభివృద్ధి చేసేందుకు గ్రీన్ ఫీల్డ్ కాలనీ ఏ, బీ వెంచర్లుగా నామకరణం చేశామన్నారు. 875 ప్లాట్లలో కొందరు అనుమతులు తీసుకొని ఇండ్లు నిర్మించుకోగా, ప్రస్తుతం 250 ప్లాట్లు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు.
అయితే తమ సర్వే నంబర్లకు ఆనుకొని ఉన్న సర్వే నం. 385లోని సుమారు ఐదెకరాల సర్కారు భూమిని కొందరు ఆక్రమించుకొని పట్టాలు సైతం చేసుకున్నారన్నారు. ఈ స్థలాన్ని 166 జీవో ప్రకారం రెగ్యులరైజ్ చేయాలని కోరామని, ప్రస్తుతం కోర్టులో స్టేటస్ కో ఇచ్చారన్నారు. ఈ సర్కారు భూమిని ఆక్రమించుకున్న వారికి అధికారులు అక్రమాలకు పాల్పడి పట్టాలిచ్చారని ఆరోపించారు. ఈ కబ్జా వ్యవహారంపై విచారణ జరిపించి, అవినీతి అధికారులు, కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.