మేడ్చల్ రూరల్, జనవరి 25 : రాష్ట్రంలో కంటి వెలుగు ఓ యాగంలా కొనసాగుతున్నదని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలంలోని డబిల్పూర్ గ్రామంలో బుధవారం కంటి వెలుగు కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కంటి పరీక్షలు చేయించుకున్న వారికి అద్దాలు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడాలేని విధంగా ఇంటింటికి వచ్చి కంటి పరీక్షలు నిర్వహించి అద్దాలు అందజేస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
108 ఉద్యోగుల సమస్యలను పరిష్కరించినందుకు గాను రాష్ట్ర 108 ఉద్యోగుల సంఘం(బీఆర్ఎస్కేవీ) ప్రతినిధులు బుధవారం మంత్రి హరీశ్‌రావు, రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతామహంతిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు జి.రాంబాబు యాదవ్, బాలాజీ, దేవేందర్‌రావు, రవీందర్‌గౌడ్, రాజు తదితరులు ఉన్నారు. – చిక్కడపల్లి, జనవరి 25
చిక్కడపల్లి, జనవరి 25 : రాష్ట్ర బడ్జెట్లో ఆర్టీసీ సంస్థకు అధిక మొత్తంలో బడ్జెట్ కేటాయించాలని కోరుతూ రాష్ట్ర అర్థిక మంత్రి హరీశ్‌రావుకు తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి థామస్‌రెడ్డి నేతృత్వంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు ఏఆర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కమలాకర్ గౌడ్, ముఖ్య సలహాదారుడు యాదయ్య, మారయ్య, రాఘవారెడ్డి తదితరులు ఉన్నారు. మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు.
ఖైరతాబాద్, జనవరి 25 : రాష్ర్టాన్ని ఆరోగ్యవంతమైన తెలంగాణగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. సోమాజిగూడ డివిజన్లోని ఎంఎస్ మక్తా కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని బుధవారం ఎమ్మెల్యే దానం నాగేందర్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటి, కార్పొరేటర్, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు వనం సంగీత యాదవ్, హైదరాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ కె.ప్రసన్నతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి పలువురికి కంటి అద్దాలను అందజేశారు.
సుల్తాన్‌బజార్, జనవరి 25 : టీఎన్జీవో సర్వే ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ యూనిట్ ఎన్నికలు బుధవారం ఏకగ్రీవంగా జరిగాయి. యూనిట్ అధ్యక్షుడిగా సాయి శ్రీకాంత్, సహ అధ్యక్షుడిగా రాజేశం, ఉపాధ్యక్షులుగా రాజేందర్‌కుమార్, అనిత, వీణ కుమారి, కార్యదర్శిగా రాధ, సంయుక్త కార్యదర్శులుగా కిరణ్‌కుమార్, జలజ, కుమారి భవాని, కోశాధికారిగా బాలరాజ్, కార్యనిర్వాహక కార్యదర్శిగా విజయ్‌కుమార్, ప్రచార కార్యదర్శిగా రాజ్‌కిరణ్, కార్యవర్గ సభ్యులుగా లక్ష్మి, ధనశ్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు నాంపల్లిలోని టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ కార్యాలయంలో జిల్లా శాఖ అధ్యక్షుడు ముజీబ్ హుస్సేనీ, కార్యదర్శి విక్రమ్‌కుమార్, అసోసియేట్ అధ్యక్షుడు కేఆర్ రాజ్‌కుమార్‌లను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో జిల్లా శాఖ సంయుక్త కార్యదర్శి ఖాలేద్ అహ్మద్, సభ్యులు ఖురేషి, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.