సిటీబ్యూరో, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): సారథి పోర్టల్ సేవలు బుధవారం నుంచి గ్రేటర్ పరిధిలోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ జిల్లావ్యాప్తంగా సారథి సేవలు ప్రారంభించగా.. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి డేటాను ఆగస్టు 7న సారథి టెక్నికల్ టీం సేకరించింది.
అనంతరం ఆ డేటా అంతా పరిశీలించి సారథిలో అప్లోడ్ చేశారు. ఇకనుంచి గ్రేటర్ పరిధిలోని వాహనదారులు ఆర్టీఏ సేవలు ఉపయోగించుకోవాలంటే గతంలో ఉన్న తెలంగాణ పోర్టల్లో కాకుండా సారథి పోర్టల్లో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. కాగా, సారథి సేవల్లో చాలావరకు టెక్నికల్ సమస్యలు తలెత్తుతున్నాయి.
రోజుకు 100 మంది లైసెన్స్ సేవల కోసం వస్తే సాంకేతిక ఇబ్బందులు వల్ల ఐదుగురివి మాత్రమే అప్రూవల్ అవుతున్నట్లు అధికారులు తెలిపారు. సాంకేతిక ఇబ్బందులను వేగవంతంగా పరిష్కరించి సేవలను సరళతరం చేయాలని వాహనదారులు కోరుతున్నారు.