ఎల్బీనగర్, నవంబర్ 11 : ఓ కేసు విషయంలో సాక్ష్యం కోసం(పంచులుగా) సంతకాలు చేయాలని విద్యుత్ సిబ్బందిపై పోలీసులు ఒత్తిడి చేయడంతో వాగ్వాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.. చైతన్యపురి పోలీస్స్టేషన్ పరిధిలో ఓ డ్రగ్స్ కేసు విషయంలో సాక్ష్యం కోసం సంతకాలు కావాలని పోలీసులు కొత్తపేట విద్యుత్ శాఖ సెక్షన్ కార్యాలయానికి సోమవారం రాత్రి వచ్చారు.
జగన్, శరత్ సిబ్బందిని సంతకాలు చేసేందుకు రావాలంటూ కోరారు. రాత్రి సమయం కావడంతో వారు నిరాకరించారు. పోలీసులు వారిని బలవంతంగా కార్యాలయంలో నుంచి తీసుకుని వచ్చి ఆటోలో ఎక్కించేందుకు యత్నించారు. తాము రామంటూ వారు చెప్పడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ విద్యుత్ ఉద్యోగులు మంగళవారం ఎల్బీనగర్ డీసీపీకి ఫిర్యాదు చేశారు.