సిటీబ్యూరో, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ) : గడిచిన ఎనిమిది నెలలుగా పేరుకుపోయిన బిల్లులను తక్షణమే చెల్లించాలంటూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టర్లు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో ఈ నెల 17 (సోమవారం) నుంచి స్వచ్ఛందంగా పనుల బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నెల 14 లోగా బకాయిలు విడుదల చేయకపోతే అత్యవసర పనులతో పాటు స్వాతంత్య్ర దినోత్సవం రోజున లైటింగ్ పనుల టెండర్లను కూడా బాయ్‌కాట్ చేస్తామని బుధవారం కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నేతలు హనుమంత్ సాగర్, గుంటి సాయి కిరణ్, ఇతర నాయకులు హెచ్చరించారు.
బక్రీద్, బోనాలు, పాఠశాలల ప్రారంభ సమయాల్లో బిల్లులు చెల్లిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్, ఏసీ ఫైనాన్స్ అధికారులు పలుమార్లు హామీలిచ్చినా అమలు కాలేదని కాంట్రాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 15 లోగా చెల్లిస్తామన్న అధికారులు, మళ్లీ మాట మార్చి సెప్టెంబర్ 15కి పొడిగించడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఏకమై ధర్నా నిర్వహించినట్లు పేర్కొన్నారు. గతంలో జరిగిన డబుల్ పేమెంట్ల నెపంతో తమ బిల్లులు నిలిపివేయడంపై కాంట్రాక్టర్లు మండిపడ్డారు.
వ్యవస్థలోని అధికారులు చేసిన పొరపాట్లను గుర్తించడానికి రెండేళ్లు పట్టిందని, అధికారుల తప్పులకు కాంట్రాక్టర్లను బాధ్యులను చేస్తూ క్రిమినల్ కేసులు పెడతామని బెదిరించడం ఎంతవరకు న్యాయమని నిలదీశారు. బాధ్యులైన అధికారులపై ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. కమిషనర్ బకాయిలు విడుదల చేసిన రోజే తిరిగి పనుల్లో చేరుతామని తేల్చి చెప్పారు. కాంట్రాక్టర్ల ఐక్యత వర్ధిల్లాలి, నో పేమెంట్ – నో వర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ ఎంఎ రజాక్, సంపంగి రమేష్, లక్ష్మణ్, రాఘవేందర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.