GHMC | సిటీబ్యూరో, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): డెంగీ జ్వరాలతో గ్రేటర్ మూలుగుతోంది. ఏ ఇంట్లో చూసినా జ్వర పీడితులే. జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా డెంగీ వంటి విష జ్వరాల బాధితులతో ఫీవర్ హాస్పిటల్, గాంధీ, ఉస్మానియా, ప్రాథమిక స్థాయిలోని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా, జిల్లా దవాఖానలు కిక్కిరిసిపోతున్నాయి.
నల్లకుంట ఫీవర్ హాస్పిటల్లోనే ప్రతి రోజూ పదుల సంఖ్యలో డెంగీ కేసులు నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇక పీహెచ్సీ, యూపీహెచ్సీ, సీహెచ్‌సీ స్థాయి దవాఖానల్లో ప్రతి రోజూ కనీసం 5నుంచి 10 మధ్య, 10 నుంచి 20 వరకు డెంగీ లక్షణాలున్న అనుమానిత కేసులు వస్తున్నట్లు ఆయా దవాఖానల అధికారులు తెలిపారు.
నగరంలో డెంగీ జ్వరం..
గ్రేటర్లో డెంగీ జ్వరం దడ పుట్టిస్తోంది. కేవలం 9రోజుల వ్యవధిలోనే గ్రేటర్ వ్యాప్తంగా 731 డెంగీ కేసులు నమోదైనట్లు సాక్షాత్తూ జీహెచ్ఎంసీ రికార్డుల ద్వారా అవగతమవుతోంది. వారం రోజుల్లోనే 731 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారుల అంతర్గత గణాంకాల ప్రకారం ప్రతి రెండు ఇళ్లలో ఒక డెంగీ కేసు నమోదవుతుంది.
అయితే రికార్డుల్లోకి వస్తున్నవి కేవలం ప్రభుత్వ దవాఖానల్లోని కేసులు మాత్రమే. ప్రైవేటు దవాఖానల్లో నమోదయ్యే డెంగీ కేసులను పట్టించుకునే తీరిక వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు లేదు. ప్రైవేటులో నమోదయ్యే కేసులను కలుపుకొంటే పై గణాంకాల ప్రకారం వారానికి సుమారు వెయ్యికి పైగానే డెంగీ కేసులు నమోదవుతున్నాయి. ఇవి కాకుండా ఇతర సీజనల్ కేసులు అదనం. ప్రతి ఇంట్లో ఇద్దరి కంటే ఎక్కువ మంది ఈ సీజనల్ జ్వరాలతో బాధపడుతున్నట్లు జీహెచ్ఎంసీ, ఆరోగ్యశాఖ గణాంకాల ద్వారా తెలుస్తోంది.
రివ్యూలు మరిచిన అధికారులు..
సాధారణంగా వర్షాకాలానికి రెండు, మూడు నెలల ముందు నుంచే సీజనల్ వ్యాధుల నివారణకు సంబంధించి ప్రభుత్వం దృష్టిపెట్టాలి. ప్రధానంగా జిల్లా కలెక్టర్లు, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, జీహెచ్ఎంసీ తదితర శాఖలకు చెందిన అధికారులతో రిప్యూ మీటింగ్‌లు జరపాలి. సీజనల్‌కు కారణమయ్యే దోమల నివారణకు జీహెచ్ఎంసీ తీసుకుంటున్న చర్యలపై దృష్టి పెట్టాలి. కలుషిత నీరు, ఆహార పదార్థాలకు సంబంధించి జలమండలితో పాటు ఇతర సంబంధిత అధికారులతో సమావేశాలు నిర్వహించాలి.
నమోదవుతున్న కేసుల ఆధారంగా ఎప్పటికప్పుడు వైద్య, ఆరోగ్యశాఖతో పాటు సంబంధిత అన్ని శాఖలను అప్రమత్తం చేస్తూ తగిన సలహాలు, సూచనలివ్వాలి. ముఖ్యంగా వైద్య, ఆరోగ్యశాఖకు సంబంధించి సీజనల్ వ్యాధులపై సంబంధిత శాఖ మంత్రి స్థాయిలో రివ్యూ మీటింగ్‌లు ఏర్పాటు చేస్తూ పరిస్థితులను సమీక్షించాలి. కానీ, ప్రస్తుత ప్రభుత్వంలో ఇలాంటివేమి కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సీజనల్‌పై అటు అధికారులు గాని, ఇటు పాలకులుగాని మొక్కుబడి చర్యలకే పరిమితమవడంతో వైద్య, ఆరోగ్యశాఖ అనారోగ్య శాఖగా మారుతోంది.
వేధిస్తున్న కిట్ల కొరత..
గ్రేటర్ పరిధిలోని పలు ప్రభుత్వ దవాఖానల్లో డెంగీ పరీక్షలు జరిపే కిట్లు లేక రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో కిట్ల కొరత కారణంగా ఓపీ రోగులకు డెంగీ పరీక్షలను బయటకు రెఫర్ చేస్తున్నట్లు రోగులు ఆరోపిస్తున్నారు. ఐపీ రోగులకు మాత్రమే డెంగీ పరీక్షలు చేస్తున్నారని, ఆ పరీక్షల రిపోర్ట్‌లను కూడా ఆలస్యంగా ఇవ్వడం వల్ల రోగి ఎక్కువ రోజులు దవాఖానలో ఉండాల్సి రావడమే కాకుండా చికిత్సలో జాప్యం జరుగుతున్నట్లు బాధితులు వాపోతున్నారు.
జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం వల్లే : వైద్యాధికారులు
నగరంలో అపరిశుభ్రత పెరిగింది. పారిశుధ్యం గురించి పట్టించుకునే వారే కరువయ్యారు. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా గ్రేటర్లో దోమల బెడద తీవ్రమైంది. ఇటీవల కురిసిన వానలతో దోమలు విజృంభిస్తున్నాయి. దోమల కారణంగా డెంగీ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గతంలో కూడా డెంగీ కేసులున్నప్పటికీ ఈ స్థాయిలో నమోదు కాలేదు. ఈ మధ్య డెంగీతో పాటు చికున్‌గున్యా, మలేరియా కేసులు కూడా నమోదవుతున్నాయి.
జనావాసాల మధ్యనే కాకుండా హాస్పిటల్స్‌లో కూడా దోమలు తీవ్రంగా ఉన్నాయి. వైద్యులు రోగులకు చికిత్స మాత్రమే చేయగలుగుతారు. డెంగీ వంటి విషజ్వరాలు రాకుండా ఉండాలంటే జీహెచ్ఎంసీ అధికారులు పకడ్బందీగా పని చేయాలి. దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి. పారిశుధ్యం నిర్వహణ సక్రమంగా ఉండాలి. అనవసరంగా వైద్య శాఖను బ్లేమ్ చేయడం సరికాదు. వైద్యులు రోగాలు రాకుండా అడ్డుకోలేరు కదా.. రోగులకు సరైన చికిత్స అందించకపోతే అప్పుడు వైద్యశాఖను నిలదీయండి.
డెంగీ కిట్ల కొరత అనేది ఉన్నతాధికారుల వైఫల్యం. మేము ఇండెంట్లు పెట్టినప్పుడు సరఫరా చేయాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. వైద్య, ఆరోగ్యశాఖలో పనిచేసే కొందరు పరిపాలనా అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ సమస్యలు. వారి వల్ల కష్టపడే వారికి కూడా చెడ్డపేరు వస్తోంది. ప్రస్తుతం పెరుగుతున్న డెంగీ కేసులకు జీహెచ్ఎంసీ అధికారులదే పూర్తి బాధ్యత. దోమల నివారణలో వారు తీసుకుంటున్న చర్యలు పేర్లలో చూపించడం కాదు.. ప్రజల్లోకి వెళ్లి తెలుసుకుంటే బాగుంటుంది.