సిటీబ్యూరో, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ ముహూర్తం దగ్గరపడుతున్న క్రమంలో గ్రేటర్ బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో స్పీడ్ పెంచారు. కానీ ప్రతిపక్ష పార్టీలు మాత్రం టిక్కెట్ల ఎంపికలోనే తర్జనభర్జన పడుతున్న పరిస్థితి. పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో? పార్టీని నమ్ముకుని ఉంటే టిక్కెట్ వస్తుందో రాదో? అనే అయోమయ పరిస్థితిలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల నేతలు ఉంటూ టికెట్ ఖరారుపైనే ఆపసోపాలు పడుతున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు మాత్రం గడిచిన నెలన్నర రోజులుగా ఎన్నికల్లో భారీ మెజార్టీ లక్ష్యంగా జనంలోనే ఉంటూ వారి ఆదరణ చూరగొంటున్నారు. పదేండ్ల ప్రగతిని వివరిస్తూనే..ఎన్నికల కోడ్‌ను దృష్టిలో ఉంచుకొని నియోజకవర్గంలో పెండింగ్ పనులను పట్టాలెక్కిస్తున్నారు. అపరిష్కృత సమస్యలకు పరిష్కారం చూపుతూ పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. నిర్మాణ దశలో ఉన్న పనులను పూర్తి చేసి ప్రారంభిస్తున్నారు. పాదయాత్ర సమయంలో ప్రజల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ముందుకు సాగుతున్నారు. అవసరం అనుకున్న చోట్ల అప్పటికప్పుడు డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణాలకు కూడా శాంక్షన్లు ఇప్పిస్తూ పనులు వెంటనే ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నారు. సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలు అందించాలన్నదే లక్ష్యంగా బీఆర్ఎస్ అభ్యర్థులు నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు.
నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు ఒకవైపు, మరో వైపు ప్రభుత్వ కార్యక్రమాలతో బీఆర్ఎస్ అభ్యర్థులు క్యాడర్లో జోష్ పెంచేలా వారిని భాగస్వామ్యం చేస్తున్నారు. బూత్ లెవల్ వారీగా సమావేశాలు , కాలనీ, సంక్షేమ సంఘం నాయకులతో మీటింగ్‌లతో కార్పొరేటర్లను, డివిజన్ అధ్యక్షులను, ద్వితీయ శ్రేణి నాయకులను సమన్వయం చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో అసంతృప్తి అన్నదే లేకుండా అందరినీ ఒక్కతాటిపైకి తీసుకువస్తూ పార్టీ అభ్యర్థులు సమష్టిగా ప్రజల్లోకి వెళుతూ జనం మెప్పు పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే గులాబీ సైన్యం జోరుతో నియోజకవర్గంలో గులాబీ గుబాళిస్తోంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు, ఇంటి వద్ద లబ్ధిదారులతో ప్రత్యేక సందడి నెలకొంది.