ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 8 : ఉస్మానియా యూనివర్సిటీ టెక్నాలజీ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థుల సహకారంతో నిర్మించిన తరగతి గదులు, ల్యాబ్‌లను ఈ సందర్భంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐఐసిటీ డైరెక్టర్ డాక్టర్ డి.శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్డీఎల్ డైరెక్టర్, ఔట్‌స్టాండింగ్ సైంటిస్ట్ జీఏఎస్ మూర్తి, ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ హాజరయ్యారు. అనంతరం డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. యూనివర్సిటీకి రావడం తనకు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుందన్నారు. పూర్వ విద్యార్థులు అందించే సొమ్ము కంటే వాళ్లు పంచే మేధస్సు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు.
కళాశాల అభివృద్ధిలో పూర్వ విద్యార్థులు మరింత భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. జీఏఎస్ మూర్తి మాట్లాడుతూ.. డీఆర్డీఎల్ వంటి రక్షణ శాఖ సంస్థలకు సైతం ఓయూ టెక్నాలజీ కళాశాల అధ్యాపకులు, విద్యార్థుల అవసరం ఎంతో ఉంటుందన్నారు. ప్రొఫెసర్ రవీందర్ మాట్లాడుతూ.. త్వరలో ఓయూలో ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. టీచింగ్, లెర్నింగ్, రీసెర్చ్లే టెక్నాలజీ కళాశాలకు వెన్నెముకలని చెప్పారు. 1983-87 బ్యాచ్ విద్యార్థుల సహకారంతో రూ.50లక్షల వ్యయంతో నిర్మించిన సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ మోడలింగ్ అండ్ సిమ్యులేషన్ను, 1972-77, 1977-82, 1982-86, 1995-99 బ్యాచ్‌ల పూర్వ విద్యార్థుల సంయుక్త సహకారంతో పునర్నిర్మించిన క్లాస్‌రూం కాంప్లెక్స్‌ను ప్రారంభించారు.
అనంతరం పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ వెంకటేశ్వర్, ప్రధాన కార్యదర్శి రాజమహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. సంఘం వార్షిక నివేదికను చదివి వినిపించారు. ఇప్పటి వరకు పూర్వ విద్యార్థుల సహకారంతో కళాశాలలో రూ.3కోట్ల వరకు అభివృద్ధి పనులు నిర్వహించినట్లు, త్వరలో మరిన్ని పనులు చేపడుతామని వివరించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల సంఘం అందించే బెస్ట్ స్టూడెంట్ అవార్డులను ఏడు మందికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చింత సాయిలు, ప్రొఫెసర్లు వీవీ బసవరావు, రమేశ్‌కుమార్, ప్రభాకర్‌రెడ్డి, శ్రీను నాయక్, రాజం, ధనలక్ష్మి, డాక్టర్ జ్యోతి, డాక్టర్ పరశురాం, డాక్టర్ పరమేశ్, కోదండరాంరెడ్డి, డాక్టర్ భాస్కర్, డాక్టర్ కవిత, డాక్టర్ ఉపేందర్, డాక్టర్ అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.