మెదక్, మే 9 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనలో అన్నదాతకు కన్నీళ్లు తప్పడం లేదు. రేవంత్‌రెడ్డి సర్కార్ సర్కారు సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో కర్షకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెదక్ జిల్లాలో రైతులు అత్యధికంగా వరి పంట సాగు చేశారు. యాసంగిలో ఘనపూర్ ఆయకట్టు, చెరువులు, వ్యవసాయ బోరుబావుల వద్ద రైతులు ఎక్కువగా వరి పంట సాగుచేశారు. వడ్ల కొనుగోలుకు ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో రైతులు పడిగాపులు పడుతున్నారు.
అధికారుల నిర్లక్ష్యంతో రైస్ మిల్లుల యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రైస్ మిల్లుల వద్ద లారీలో ఉన్న ధాన్యాన్ని అన్లోడ్ చేసేందుకు అవసరమైన కూలీలు అందుబాటులో ఉంచడం లేదు. కొనుగోలు కేంద్రాల నుంచి తీసుకుపోయినా లారీల్లోని ధాన్యం రెండు, మూడు రోజులైనా ఖాళీ కావడం లేదు. కొనుగోలు కేంద్రాల వద్ద తేమ పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ధాన్యం తేమగా ఉందని తరుగు తీస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద సౌకర్యాలు లేక రైతులు తీసుకువచ్చిన ధాన్యం అకాల వర్షాలకు తడిచిపోతున్నది. మెదక్ జిల్లాలో 13, 532 మంది రైతుల నుంచి 67,489.480 మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నట్లు అధికారులు తెలిపారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం మిల్లులకు తరలించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన 5341 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.62.87 కోట్లు జమచేసినట్లు అధికారులు తెలిపారు.
నత్తనడకన కొనుగోళ్లు
మెదక్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన కొనసాగుతున్నాయి. పౌరసరఫరాలశాఖకు చెందిన అధికారుల పర్యవేక్షణ సక్రమంగా లేదు. కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యాన్ని సకాలంలో కాంటా చేయడం లేదు. లారీల కొరతతో ధాన్యం సకాలంలో రైస్‌మిల్లులకు చేరడం లేదు. లారీల సంఖ్య పెంచాలని రైతులు పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదు.కొనుగోలు కేంద్రాల వద్ద స్థలం లేక రైతులు రోడ్లపై ధాన్య ఎండబెడుతున్నారు. నాణ్యత పేరుతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కొర్రీలు పెడుతున్నారు.
మెదక్ జిల్లాలో అధికార కాంగ్రెస్ నేతలు, అధికారుల మధ్య పచ్చన్నయుద్ధం నడుస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. రైతుల పేరుతో కాంగ్రెస్ నేతలు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కలెక్టర్ తమ మాట వినడం లేదని కావాలనే రైతులను అడ్డుపెట్టుకొని మెదక్ కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ నేతలు ధర్నా చేసిన సంగతి తెలిసిందే. కావాలనే కలెక్టర్‌పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని అధికార యంత్రాంగం కినుకు వహించినట్లు తెలిసింది. కాగా, ధాన్యం సేకరణలో తీవ్ర జాప్యంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు శనివారం మెదక్ కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇబ్బందులు పడుతున్నాం
కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చి 20 రోజులు అవుతున్నది. కొనుగోలు కేంద్రంలో ఇప్పుటి వరకు తూకం వేయడం లేదు. లారీలు రాక ధాన్యం కాంటా వేయడం లేదని అధికారులు చెబుతున్నారు. గతంలో రోజుకో లారీ వచ్చేంది, ప్రస్తుత్తం మూడు, నాలుగు రోజులకు ఒక లారీ వస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మేమే ఇబ్బందులు పడుతున్నాం.
– మొకిరే శ్రీశైలం, రైతు, అగ్రహారం (మెదక్ జిల్లా)
రెండు వారాలుగా కాంటా చేయడం లేదు
ధాన్యం తరలించడానికి లారీలు రావడం లేదు. 15 రోజులైనా కాంటా చేయడం లేదు. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చి పడిగాపులు కాస్తున్నాం. తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. లారీలు వచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. తూకం వేయకపోవడంతో కొనుగోలు కేంద్రం వద్ద వడ్ల కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది.
– భూపాలకృష్ణ, రైతు, గవ్వలపల్లి (మెదక్ జిల్లా)