e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 12, 2021
Home హైదరాబాద్‌ అపవాదును చెరిపేసుకున్న పట్టభద్రులు

అపవాదును చెరిపేసుకున్న పట్టభద్రులు

అపవాదును చెరిపేసుకున్న పట్టభద్రులు
  • చైతన్యస్ఫూర్తి చాటిన విద్యావంతులు 
  • పోలింగ్‌ కేంద్రాలకు పోటెత్తిన ఓటర్లు
  • శభాష్‌ అనిపించుకున్న ఐటీ కారిడార్‌  
  • పాతబస్తీలో పెరిగిన ఓటింగ్‌ శాతం
  • ప్రత్యేక ఆకర్షణగా బ్యాలెట్‌ పేపర్‌, జంబో బాక్సులు 
  • కొత్త అనుభూతినిచ్చిందన్న ఓటర్లు 
  • 72.45 శాతం పోలింగ్‌ నమోదు

హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల స్థానానికి ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. రికార్డు స్థాయిలో గ్రాడ్యుయేట్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. నగరవాసులు ఓటెయ్యడంలో నిర్లిప్తత చూపుతారనే అపవాదును చేరిపేస్తూ..  సరికొత్త స్ఫూర్తిని చాటారు. ఐటీ ఉద్యోగులు సైతం ఇదే బాటను అనుసరించారు. ఎన్నికల సంఘం… రాజకీయ పార్టీలు.. మేధావులు… మీడియా చేసిన కృషి ఫలించి.. గ్రేటర్‌లో ఎన్నడూ చూడని విధంగా పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరిన అపురూప దృశ్యాలు సాక్షాత్కరించాయి. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించగా, సమయం దాటినా.. అప్పటికే క్యూ లైన్లలో 

ఉన్న వారికి  ఓటు వేసే అవకాశం కల్పించారు. సెలవు దినం అయినప్పటికీ ఊరెళ్లిన వారు,  విదేశాల్లో ఉండే వారు సైతం వచ్చి.. ఎంతో ఓపికతో గంటల తరబడి నిల్చొని బాధ్యత నెరవేర్చడం విశేషం.  ఇక జంబో బ్యాలెట్‌ పత్రంపై ఓటు వేయడం కొత్త అనుభూతి ఇచ్చిందని పలువురు ఓటర్లు అభిప్రాయపడ్డారు. మొత్తంగా విద్యావంతులు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొనడంతో ఈ గ్రాడ్యుయేట్‌ స్థానంలో 72.45 శాతం పోలింగ్‌ నమోదైంది.

అపవాదును చెరిపేసుకున్న పట్టభద్రులు

మండలి పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఇక మిగిలింది కౌంటింగ్‌ మాత్రమే..అభ్యర్థుల భవితవ్యం  బ్యాలెట్‌ బాక్సుల్లో నిక్షిప్తమయ్యాయి. ఓటర్లు ఎవరికి ఓటు వేశారు? ఎవరి వైపు మొగ్గు చూపారనే లెక్కల్లో బిజీ అయ్యారు ప్రధాన పార్టీల నేతలు. తామంటే తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. బరిలో 93 మంది అభ్యర్థులు ఉండటం, అంతకు మించి రికార్డు స్థాయిలో పోలింగ్‌ శాతం నమోదు కావడంతో తీర్పు ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొన్నది. ఎవరి అంచనాలు ఎలా ఉన్నా..17న జరిగే కౌంటింగ్‌లో విజేతలేవరో తేలిపోనున్నది.

హైదరాబాద్‌-మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలో 5,31,268మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1.94లక్షలకు పైగా మహిళా ఓటర్లు ఉన్నారు. వాస్తవంగా 2015తో పోలిస్తే ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంలో మూడు ఉమ్మడి జిల్లాలు ఉండగా.. ప్రస్తుతం తొమ్మిది జిల్లాల పరిధిలో పెద్ద ఎత్తున పట్టభద్రులు తమ ఓటు హక్కును నమోదు చేయించుకున్నారు. రాజకీయ పార్టీలు సైతం ఆది నుంచి ఓటర్ల నమోదుపై దృష్టిసారించడం కూడా ఓట్లు పెరిగేందుకు కారణంగా చెప్పవచ్చు. ఈ క్రమంలో 2015తో పోలిస్తే ఏకంగా 188శాతం ఓట్లు పెరిగాయి. అయితే ఓట్లు పెరిగిన స్థాయిలో పోలింగ్‌ నమోదువుతుందా? లేదా? అనే ఆందోళన ఆది నుంచి అందరినీ వెంటాడుతుంది. ముఖ్యంగా గ్రేటర్‌ హైదరాబాద్‌లో ప్రతి ఎన్నికల్లోనూ పోలింగ్‌ శాతం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల కంటే తక్కువగా నమోదవ్వడం అనేది ఆనవాయితీగా వస్తుంది. 2009 పట్టభద్రుల ఎన్నిక మొదలు 2015 ఎన్నికలు… ఆపై 2018 శాసనసభ, 2019 లోక్‌సభతో పాటు గత ఏడాది డిసెంబరులో జరిగిన గ్రేటర్‌ ఎన్నికల్లోనూ ఆశించిన స్థాయిలో పోలింగ్‌ నమోదు కాలేదు. దీంతో ఈ ఎన్నికల్లోనూ గ్రేటర్‌ హైదరాబాద్‌, మిగిలిన ప్రాంతాల్లోని పట్టణాల్లో ఈ ప్రభావం కనిపిస్తుందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.

గత చరిత్ర ఇది

హైదరాబాద్‌-మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గానికి 2009లో జరిగిన ఎన్నికలో కేవలం27.23 శాతం పోలింగ్‌ మాత్రమే నమోదైంది. ఆ తర్వాత 2015లో జరిగిన ఎన్నికలోనూ కాస్త మెరుగై.. 37.72 శాతం నమోదైంది. ఈ ఎన్నికలో మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో 2,96,317 మంది ఓటర్లు ఉండగా.. కేవలం 1,11,766 మంది పట్టభద్రులు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా 2018 ఎన్నికల సందర్భంగా గ్రేటర్‌ హైదరాబాద్‌లో 39.49 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. 2019 పార్లమెంటు ఎన్నికల్లో 44.75శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత ఏడాది చివర్లో జరిగిన గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో 46.55శాతంగా పోలింగ్‌ నమోదైంది. అంటే ఏనాడూ కనీసం సగం మంది కూడా తమ ఓటును వినియోగించుకున్న దాఖలాలు లేవు. ప్రధానంగా ఐటీ ఉద్యోగులు, విద్యావంతులే ఓటింగ్‌కు దూరంగా ఉంటారనే అపవాదు ఆది నుంచి ఉంది. పోలింగ్‌ రోజును సెలవు దినంగా భావించి గడప దాటరనేది ప్రతిసారీ వినిపించే విమర్శ. 

చరిత్ర తిరగరాసిన విద్యావంతులు

గత అనుభవాలు.. అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ ఈసారి నగర ఓటరు పోలింగ్‌ కేంద్రాల ముందు బారులు తీరడం ప్రజాసామ్యంలో నూతనోత్తేజాన్ని నింపింది. ఓటు నమోదు మొదలు ఓటు హక్కు వినియోగం వరకు పట్టభద్రులు ప్రదర్శించిన చైతన్యం అభినందనీయంగా ఉంది. ముఖ్యంగా కోర్‌ సిటీ మొదలు వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలోని మారుమూల ప్రాంతాల వరకు ప్రతి చోటా ఉదయం నుంచి సాయంత్రం వరకు అవే క్యూ లైన్లు కనిపించడం విశేషం. ఒకవైపు ఎండ తీవ్రత ఉన్నా.. జంబో బ్యాలెట్‌ పేపర్‌ అయినందున ముందువారు ఓటేసేందుకు ఎక్కువ సమయంతో గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వచ్చినా ఓటర్లు ఓపికతో తమ హక్కును వినియోగించుకోవడం ఈసారి అందరిలోనూ సంతోషాన్ని నింపింది. తొమ్మిది జిల్లాల్లో అత్యధికంగా జోగులాంబ గద్వాలలో 80.86శాతం పోలింగ్‌ నమోదు కాగా.. తక్కువగా హైదరాబాద్‌ జిల్లాలో 52.76 శాతం నమోదైంది. ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

పోలింగ్‌ ముగియగానే సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌లకు బ్యాలెట్‌ బాక్స్‌లను అధికారులు గట్టి బందోబస్తు నడుమ తరలించారు. మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ జిల్లాలకు వేర్వేరుగా స్ట్రాంగ్‌ రూమ్‌లను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ స్ట్రాంగ్‌ రూమ్‌లకు ముందుగా సమీపంలోని హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, వికారాబాద్‌ జిల్లాలకు చెందిన బ్యాలెట్‌ బాక్స్‌లను తరలించారు. జోగులాంబ గద్వాల్‌, వనపర్తి, నాగర్‌ కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, నారాయణపేట్‌ జిల్లాలకు చెందిన బ్యాలెట్‌ బాక్స్‌లు అర్ధరాత్రి వరకు తరలించారు. స్ట్రాంగ్‌ రూమ్‌కు చేరుకున్న ప్రతి బ్యాలెట్‌ బాక్సుకు ప్రత్యేక నంబరు వేసి వాటిని క్రమ సంఖ్య పద్ధతిలో ఉంచారు. వీటితో పాటు ప్రిసైడింగ్‌ అధికారులు సమర్పించిన చట్టబద్ధమైన పోలింగ్‌ సామగ్రి నివేదికలను ప్రత్యేక కవర్లలో ఉంచి ఎన్నికల అధికారులకు అందజేశారు. రిట్నరింగ్‌ అధికారి ప్రియాంక అలా సమక్షంలో ఈ బ్యాలెట్‌ బాక్స్‌లు భద్రపరిచే ప్రక్రియ కొనసాగింది.

మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ శాసనమండలి పట్టభద్రుల స్థానానికి ఆదివారం జరిగిన పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8గంటలకు ప్రారంభం కావడంతోనే పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చారు. మధ్యాహ్నం తర్వాత పట్టభద్రులు పోలింగ్‌ కేంద్రాలకు గణనీయంగా పోటెత్తారు. సాయంత్రం నాలుగు గంటల తర్వాత అప్పటికే క్యూ లైన్లలో ఉన్న పట్టభద్రులకు అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. పోలింగ్‌ నమోదు సరళిని చూస్తే ఉదయం 10గంటలకు 7.96శాతం, 12గంటలకు 21.63శాతం, మధ్యాహ్నం 39.09శాతం, సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రాథమికంగా 64.67శాతం నమోదైనట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రకటించారు. 

అత్యధికంగా జోగులాంబ గద్వాల్‌లో..

మండలి పరిధిలో అత్యధికంగా జోగులాంబ గద్వాల్‌ జిల్లాలో 80.86 శాతం , వికారాబాద్‌లో 80.30శాతం, హైదరాబాద్‌ జిల్లాలో 52.76, రంగారెడ్డి జిల్లాలో 65.25శాతంగా నమోదైంది. కాగా వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో ఓటర్లు హాలిడే మూడ్‌లో ఉండే అవకాశం ఉందని అందరూ భావించారు. కానీ మేధావులు, ప్రజాస్వామ్యవాదులు ఓటు వేసేందుకు భారీగా తరలివచ్చారు. ఓటర్‌ జాబితాలోని ప్రతి ఒక్క పట్టభద్రుడు విధిగా ఓటు వేయాలనే స్పృహతో ముందుకొచ్చి చైతన్యాన్ని ప్రదర్శించడం గమనార్హం.

ఫలించిన చర్యలు 

ప్రతి పోలింగ్‌ కేంద్రంలో ఓటర్లు కరోనా నిబంధనలు పాటించారు. క్యూ లైన్లలో భౌతిక దూరాన్ని పాటించారు. అధికారులు శానిటైజర్‌ అందుబాటులో ఉంచారు. వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు చేశారు. ఎండతీవ్రత ఉండటంతో టెంట్లు ఏర్పాటు చేశారు. ఫస్ట్‌ ఎయిడ్‌ చికిత్సకై జాగ్రత్తలు తీసుకున్నారు. పలు పోలింగ్‌ కేంద్రాలను రిటర్నింగ్‌ అధికారి ప్రియాంక అలా పరిశీలించారు. కాగా జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి హైదరాబాద్‌ ఎన్నికల అధికారి లోకేశ్‌కుమార్‌ వెబ్‌ కాస్టింగ్‌ కెమెరాల ద్వారా ఓటింగ్‌ ప్రక్రియను పర్యవేక్షించారు. 

అదనపు పోలింగ్‌ కంపార్టుమెంట్లు ఏర్పాటు 

ఉదయం నుంచి పోలింగ్‌ కేంద్రాలకు పెద్ద ఎత్తున ఓటర్లు తరలివచ్చారు. 93మంది అభ్యర్థులతో కూడిన బ్యాలెట్‌ పేపర్‌ పెద్దదిగా ఉండటంతో ఓటు వేయడానికి అధిక సమయం పట్టింది. దీంతో మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పోలింగ్‌ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున క్యూ లైన్లు దర్శనమిచ్చాయి. దీంతో అవసరమైన పోలింగ్‌ కేంద్రాల్లో అదనపు పోలింగ్‌ కంపార్టుమెంట్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్న ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్‌ ఆదేశాల మేరకు భారీ క్యూ లైన్లు ఉన్న పోలింగ్‌ కేంద్రాలలో అదనపు ఓటింగ్‌ కంపార్టుమెంట్లు ఏర్పాట్లు చేశారు. కాగా ఓటు వేసే క్రమంలో ఓటరు అవసరమైన సమయాన్ని కేటాయించడం గమనార్హం.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అపవాదును చెరిపేసుకున్న పట్టభద్రులు

ట్రెండింగ్‌

Advertisement