కుత్బుల్లాపూర్, నవంబర్ 15: బతికిండగానే మంటలో పడి కాలి బూడిదయ్యాడు ఓ పారిశుద్ధ్య కార్మికుడు.. మూర్చవ్యాధి వస్తే సుమారు అర్ధగంట పాటు నేలపై పడి కొట్టుకుంటూ తిరిగి యాధాస్థానానికి వస్తాడు. కానీ ఈ సారి మూర్చ వ్యాధి వచ్చిన సమయంలో పక్కనే చెత్త, ఇతర వ్యర్థాలను తగులబడుతున్న మంటలో పడిపోయాడు. దీంతో ఒక్కసారిగా ఒంటికి నిప్పంటుకొని అక్కడే ప్రాణాలు వదిలాడు.. మిగిలి ఉన్న భాగాలను కుక్కలు పీక్కుతిన్న విషాద ఘటన కుత్బుల్లాపూర్ సర్కిల్లో చోటు చేసుకుంది. ఈ ఘటన తోటి కార్మికులను, చూపరులను కంటతడిపెట్టించింది.వివరాలిలా ఉన్నాయి.
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని కేశ్వాపూర్ గ్రామానికి చెందిన పి.అంజయ్య (58), అతని భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి గత కొన్నేండ్ల కిందట నగరానికి వలస వచ్చి చింతల్ డివిజన్ భగత్‌సింగ్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయం పరిధిలో ఔవుట్ సోర్సింగ్ విభాగంలో పారిశుధ్య కార్మికుడిగా పని చేస్తున్నాడు. అంజయ్యకు అప్పుడప్పుడు మూర్చవ్యాధి వస్తుండేది. దీంతో నేలపై పడి కొట్టుకుంటూ కొంత సేపటికి అతనికతనే తిరిగి లేచేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా శుక్రవారం మధ్యాహ్నం తర్వాత పని ముగించుకొని హాజరు వేయించుకోవాల్సిన సమయంలో అంజయ్య సంబంధిత ఎస్ఎఫ్ఏ వద్దకు రాలేదు. అప్పటికే ఆరా తీసినప్పటికీ ఆచూకి లభించలేదు. రాత్రి కూడా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆచూకి కోసం వెతికారు. అయినా ఫలితం లేకుండా పోయింది.
కాగా శనివారం ఉదయం తెల్లవారుజామున కుత్బుల్లాపూర్ గ్రామం నుండి సర్కిల్ కార్యాలయానికి వెళ్లే ప్రధాన రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్ల సమూహంలో సగం కాలిన శవాన్ని కుక్కలు పీక్కుతినడం పారిశుధ్య కార్మికులకు కనిపించింది. అంజయ్య మృతదేహంగా గుర్తించిన కార్మికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు పోలీసులకు సమాచారం అందించగా, ఘటన స్థలానికి చేరుకొని సగం కాలిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని, గాంధీ మార్చురీకి తరలించారు. మృతుడికి భార్యతోపాటు కొడుకు, కూతురు ఉన్నారు. బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విధి నిర్వాహణలో మృతి చెందిన బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కార్మిక సంఘాల ప్రతినిధులు, తోటి కార్మికులు వేడుకుంటున్నారు.