మేడ్చల్, సెప్టెంబర్ 11(నమస్తే తెలంగాణ): విద్యార్థుల సామర్థ్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వం తొలిమెట్టు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమం ద్వారా చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణను విద్యాశాఖ అందించనున్నది. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 397 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులకు ఏడాది పాటు శిక్షణను అందించనున్నారు. గత నెల ఆగస్టు 15న తొలిమెట్టు కార్యక్రమాన్ని జిల్లాలో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఉపాధ్యాయులకు ఈ కార్యక్రమంపై అవగాహన(శిక్షణ) కూడా కల్పించారు. కరోనా కారణంగా రెండేండ్ల కాలం చాలా మంది విద్యార్థులు చదువులో వెనుకబడిపోయారు. అలాంటి వారు తిరిగి చదువులో రాణించే విధంగా విద్యాశాఖ తొలిమెట్టు పేరుతో ప్రత్యేక శిక్షణ అందించనుంది.
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో, ప్రభుత్వం మరింత బాధ్యతగా చదువులో విద్యార్థుల సామర్థ్యాన్ని పెంచేందుకు తొలిమెట్టు పేరుతో ప్రత్యేక శిక్షణ తరగతులను ప్రారంభించింది. ఈ శిక్షణా తరగతులను ప్రత్యేకంగా వారం రోజులకోకసారి జిల్లా వ్యాప్తంగా ఉన్నతాధికారులు సమీక్షించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా అన్ని పాఠ్యాంశాలపై దృష్టి పెట్టనున్నారు.
విద్యాభివృద్ధికి తొలిమెట్టు
చదువులో విద్యార్థుల సామర్థ్యాన్ని పెంచేందుకు తొలిమెట్టు ద్వారా ప్రత్యేక శిక్షణను అందిస్తున్నాం. ఈ అంశంపై ఇప్పటికే ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి, అవగాహన కల్పించాం. తొలిమెట్టు ద్వారా చదువులో వెనుకబడిన విద్యార్థులను తీర్చిదిద్దే అవకాశం ఉంది. ఈ కార్యక్రమం ద్వారా ఒకటి నుంచి 5వ తరగతి విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా విద్యాశాఖ కృషి చేస్తున్నది. తొలిమెట్టు శిక్షణపై వారం రోజులకోకసారి ప్రత్యేకంగా సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నాం. – జిల్లా విద్యాధికారి, విజయకుమారి