మేడ్చల్, డిసెంబర్25 (నమస్తే తెలంగాణ): అద్దె భవనాలలో నిర్వహిస్తున్న ప్రభుత్వ కార్యాలయాలను వెంటనే ఖాళీ చేసి ప్రభుత్వ భవనాలలోకి మారాలని సర్కార్ ఇచ్చిన ఆదేశాల మేరకు అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఈనెల 31వ తేదీలోగా ప్రభుత్వ భవనాలలోకి మారాలని లేనిపక్షంలో ఫిబ్రవరి నుంచి అద్దె చెల్లించేది లేదని ఇటీవల ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో.. మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలు ఉండగా ఇందులో జిల్లాకు సంబంధించిన కార్యాలయాలన్ని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఉండగా సబ్‌రిజిస్ట్రర్, ఎక్సైజ్ కార్యాలయాలు, బీసీ వెల్ఫేర్, అంగన్వాడీ కేంద్రాలు, బస్తీదవాఖానలు ఉన్నాయి.
జిల్లాలో ఉన్న ఎక్సైజ్ కార్యాలయాలు అద్దె భవనాలలో ఉండగా, కొన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాలు సొంత భవనాల్లో మరికొన్ని అద్దె భవనాలలో కొనసాగుతున్నాయి. ఎక్సైజ్ సూపరిండెంటింగ్ కార్యాలయం, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలు సైతం అద్దె భవనంలోనే నిర్వహిస్తున్నారు.అయితే ఈ నెలాఖరులోగా సొంతభవనాలలో మారాలని ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు ఇబ్బందులకు గురువుతున్నారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు శిథిలావ్వస్థకు చేరి సౌకర్యాలు లేకుండా ఉన్నాయి. వాటికి మరమ్మతులు, సౌకర్యాలు కల్పించుకునేందుకు సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో మరికొంత గడువు ఇస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌కు కొన్ని ప్రభుత్వ కార్యాలయాలను తరలించేలా అధికారులు పరిశీలిస్తున్నారు. జిల్లాలోని 13 మున్సిపాలిటీలు ఇటీవలే జీహెచ్ఎంసీలో విలీనమైన నేపథ్యంలో కలెక్టరేట్లోని కొన్ని శాఖలు జీహెచ్ఎంసీలో విలీనమయ్యాయి. దీంతో ఇక్కడ నుంచి కొన్ని శాఖలు ఉండే అవకాశం లేదు. దీంతో ఖాళీ అయిన శాఖలలో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
మేడ్చల్ జిల్లా.. అర్బన్ ప్రాంతంగా మారిన క్రమంలో జెడ్పీ కార్యాలయం, జిల్లాలోని ఎంపీడీవో కార్యాలయాలను వాడుకునే విధంగా చూస్తున్నారు. జిల్లా రిజిస్ట్రర్ కార్యాలయం మేడ్చల్‌లో ఉన్న జెడ్పీ కార్యాలయంలోకి మారనుందని తెలుస్తోంది. ఎంపీడీవో కార్యాలయాలను వివిధ శాఖలు వినియోగించుకోనన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఆయా పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. అయితే అంగన్వాడీ, బస్తీ దవాఖానల పరిస్థితి ఎమిటన్నది ప్రశ్నార్థకరంగా మారింది.