ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 19: స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుంచి నేటి వరకు దేశం అన్ని రంగాల్లో ఎంతగానో అభివృద్ధి చెందిందని ఇస్రో చైర్మన్ డాక్టర్ వీ నారాయణన్ అన్నారు. వందో స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకునే రోజుకల్లా అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశం నిలుస్తుందని ఆయన ఆకాంక్షించారు. ఉస్మానియా యూనివర్సిటీ 84వ స్నాతకోత్సవం ఠాగూర్ ఆడిటోరియంలో మంగళవారం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో వర్సిటీ చరిత్రలో తొలిసారిగా 1258 మంది పీహెచ్డీ పట్టాలు పొందారు. 2022-2023 విద్యాసంవత్సరానికి గాను 58 బంగారు పతకాలు, 2023-2024 విద్యాసంవత్సరానికి గాను 63 బంగారు పతకాలు, మొత్తం 121 బంగారు పతకాలను ప్రదానం చేశారు. ఇంగ్లీష్‌లో ఉత్త మ పరిశోధక గ్రంథం సమర్పించిన గిరిజన విద్యార్థికి రాష్ట్ర గవర్నర్ పేరుతో ఒక బంగారు పతకం, ఐఏఎస్ అధికారిణి దేవసేన తండ్రి పేరుపై ఎంబీఏ ఫైనాన్స్‌లో ఉత్తమ ప్రదర్శన చేసిన వారికి ప్రొఫెసర్ సముద్రాల సత్యనారాయణ మూర్తి మెమోరియల్ బంగారు పతకాలను నూతనంగా ప్రదానం చేశారు.
వేడుకలు ప్రారంభం కాకముందు వివిధ శాఖల డీన్లు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల సమావేశం లాంఛనంగా నిర్వహించారు. అనంతరం ప్రారంభమైన పట్టాల ప్రదాన కార్యక్రమానికి వర్సిటీ చాన్స్‌లర్ హోదాలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్య అతిథిగా డాక్టర్ నారాయణన్ హాజరయ్యారు. వేదికపై ముఖ్యఅతిథితో పాటు గవర్నర్, ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేష్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలు, ఐఏఎస్ అధికారిణి దేవసేన, ఓఎస్డీ, డీన్లు ఆసీనులయ్యారు.
అనంతరం వీసీ పట్టాలు, పతకాలు పొందనున్న విద్యార్థులచే వర్సిటీ సాంప్రదాయం ప్రకారం ప్రతిజ్ఞ చేయించారు. గవర్నర్ చేతుల మీదుగా డాక్టర్ నారాయణన్‌కు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. అనంతరం స్నాతకోత్సవ ఉపన్యాసాన్ని వెలువరించిన డాక్టర్ నారాయణన్ మాట్లాడుతూ..
తనకు వచ్చిన గౌరవ డాక్టరేట్ దేశ అంతరిక్ష విభాగంలోని ఇరవై వేల మంది ఉద్యోగులకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. అనంతరం బంగారు పతకాలు ప్రదానం చేసిన గవర్నర్ దాదాపు మూడింట ఒకవంతు పీహెచ్డీ పట్టాలు ప్రదానం చేసి వెళ్లిపోవడంతో విద్యార్థులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్, ప్రొఫెసర్ సీహెచ్ శ్రీనివాసులు, పీఆర్వో ప్రొఫెసర్ ప్యాట్రిక్, ఏపీఆర్వో రఘుపతి, వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు.
ఏర్పాట్లలో అడుగడునా నిర్లక్ష్యం
ఓయూ అధికారులు అట్టాహాసంగా నిర్వహించిన స్నాతకోత్సవం ఎక్కడ చూసినా లోపాలమయంగా కనిపించింది. మీడియా ప్రతినిధులకు ఇచ్చిన పాస్‌లపై ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురించిన కథనంలో పేర్కొన్న విధంగానే రిపోర్టర్లను భద్రతా సిబ్బంది నిలిపివేశారు. ప్రధాన గేటు నుంచి కాదని మరోగేటు వైపు నుంచి రావాలని చెప్పి, అక్కడకు వెళ్లగా అక్కడి నుంచి ప్రవేశం నిరాకరించారు. తీరా అక్కడే ఉన్న వర్సిటీ అధికారులు కల్పించుకుని మీడియా ప్రతినిధులను లోపలికి పంపించారు. భద్రతా ఏర్పాట్లలో డొల్లతనం కనిపించింది. తనిఖీలు సైతం తూతూమంత్రంగానే నిర్వహించారు.
సెల్ఫోన్లను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని పేర్కొన్న అధికారులు ఆడిటోరియంలో మాత్రం ఆ ఊసే మరిచారు. విద్యార్థులు ఆడిటోరియంలో సెల్ఫోన్లలో ఫొటోలు దిగుతుండటంతో వారిని కూర్చోవాలని వేదికపై నుంచి అదేపనిగా నిర్వాహకులు విజ్ఞప్తి చేయాల్సి వచ్చింది. కుర్చీల కేటాయింపులో తీవ్ర గందరగోళం నెలకొంది. వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్, ఇతర ఉన్నతాధికారులకు సైతం ప్రత్యేకంగా కుర్చీలు కేటాయించకపోవడంతో వారు మీడియా ప్రతినిధులకు కేటాయించిన కుర్చీలలో కూర్చున్నారు.
మరోవైపు ఒకే నంబర్లు మీడియా ప్రతినిధులు, బంగారు పతక దాతలకు కేటాయించారు. బంగారు పతకాలు, పీహెచ్డీ పట్టాలు స్వీకరించే వారికి అందజేసే కిట్లు సైతం అభ్యర్థులందరికీ అందజేయలేకపోయారు. రూ.2,200 రుసుము తీసుకుని కనీసం కిట్ కూడా ఇవ్వలేదని అధికారులపై మండిపడ్డారు. కనీసం మంచినీరు సైతం సరఫరా చేయడంలో విఫలమయ్యారనిధ్వజమెత్తారు.