Wellness Centers | సిటీ బ్యూరో, మార్చి 03 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులకు ఆరోగ్య సేవలందించే ప్రభుత్వ వెల్నెస్ సెంటర్లు సమస్యలతో స్వాగతం పలుకుతున్నాయి. వైద్యంకోసం వచ్చే వారికి నీరసం తప్ప సకాలంలో వైద్యం అందడం లేదు. వెల్నెస్ కేంద్రాల్లో నాడీ పట్టే వైద్యులు సరిపడా లేకపోవడంతో ఇబ్బందులపాలవుతున్నారు.
ఓపీలో ఒక్కరే..
హైదరాబాద్ జిల్లాలో ఉన్న ఖైరతాబాద్ వెల్నెస్ సెంటర్ సమస్యల నిలయంగా మారింది. గత ప్రభుత్వంలో ఓపీల తాకిడితో కిటకిటలాడేది. ప్రస్తుతం అనుకున్న స్థాయిలో జనాలు రాకపోవడంతో ఓపీ రోగుల సంఖ్య తగ్గడం గమనార్హం. వచ్చినవారికి సైతం సకాలంలో వైద్యం అందించేందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు. పొరుగు సేవల ప్రాతిపాదికన నియామకమైన వైద్య సిబ్బందిలో చాలా మంది రిటైర్డ్ వైద్యులున్నారు. వారంతా ఒకపక్క అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరో పక్క పేషెంట్లకు సేవలందిస్తున్నారు. గతంలో ఓపీ సేవల్లో జనరల్ ఫిజీషియన్లు ముగ్గురు ఉండేవారు.
సోమవారం ఒక్కరు మాత్రమే ఓపీలో సేవలందించడం వల్ల రోగులు గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. రోగికి రాసిన మందుల్లో సగం మాత్రమే ఆసుపత్రిలోని ఫార్మసిలో లభించగా, మిగతావి వారంరోజుల్లోగా వస్తాయంటూ సిబ్బంది నిర్లక్ష్యపు సమాధానం ఇవ్వడం గమనార్హం. దీర్ఘకాలపు జబ్బులకు మందులు లేకపోవడంతో ప్రైవేట్ ఫార్మసీల్లో డబ్బులు పెట్టి కొనుక్కునే పరిస్థితి నెలకొనడంతో వైద్యంకోసం వచ్చేవారంతా ఇబ్బంది పడుతున్నారు.
నిర్లక్ష్యపు సమాధానాలు..
వెల్నెస్ కేంద్రంలోని పలువురు కిందిస్థాయి ఉద్యోగులు రోగుల పట్ల నిర్లక్ష్యపు వైఖరితో ఉన్నారు. వైద్యం చేయించుకునే సందర్భంలో సందేహాలు అడిగినా, మిగతా మందులు ఎప్పుడొస్తాయని అడిగినా కూడా సరైన సమాధానం ఇవ్వకుండా వ్యవహరిస్తుండటం గమనార్హం. సిబ్బంది వైఖరిపై రోగులు అసహనంతో ఉన్నారు.