సిటీబ్యూరో, జూలై 5 (నమస్తే తెలంగాణ ): ఏడు దశాబ్దాలుగా అమల్లో ఉన్న జీహెచ్ఎంసీ చట్టం-1955 స్థానంలో ప్రభుత్వం కోర్ అర్బన్ రీజియన్ బిల్లు -2026 క్యూర్ బిల్లును తీసుకువస్తున్నది. ఈ మేరకు ముసాయిదా బిల్లును ఆదివారం రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ విడుదల చేసింది. ఈ ప్రతిపాదిత నూతన బిల్లుపై ప్రజలు, నిపుణుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు వీలుగా ప్రజాభిప్రాయాలను తెలియజేయవచ్చని స్పష్టం చేసింది. 15 లక్షల జనాభా ఉన్న కాలం నాటి పాత చట్టం.. ప్రస్తుతం 1.3 కోట్లకు చేరిన మహానగర అవసరాలకు సరిపోకపోవడంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ బిల్లు ద్వారా కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో సమగ్ర పాలన కోసం ఒకే రకమైన వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమంత్రి అధ్యక్షుడిగా క్యూర్ అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్’, ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీని ఈ బిల్లు ద్వారా ఏర్పాటు చేయనున్నారు. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల రక్షణ కోసం ఇప్పటికే ఏర్పాటైన ‘హైడ్రా’తో పాటు విపత్తు నిర్వహణ, ట్రాఫిక్ మేనేజ్మెంట్, కె్లైమేట్ యాక్షన్, హెరిటేజ్ సంరక్షణ కోసం ప్రత్యేక అథారిటీలను ఏర్పాటు చేయనున్నారు. కాగా, జూలై 24 2026 వరకు పౌరులు , రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, పరిశ్రమలు, నిపుణులు, పౌర సమాజ సంస్థలు తమ సూచనలు, అభ్యంతరాలను సలహాలను ప్రభుత్వానికి పంపవచ్చు.
ట్రై కార్పొరేషన్ల పరిధిలో ఇప్పటి వరకు ఉన్న ‘వార్షిక అద్దె విలువ’ స్థానంలో, ఇకపై క్యాపిటల్ వ్యాల్యూ’ ఆధారంగా ఆస్తి పన్నును లెకించనున్నారు. సెల్ఫ్ అసెస్మెంట్ విధానాన్ని, ‘ఇంటిగ్రేటెడ్ ప్రాపర్టీ ఐడెంటిటీ కోడ్’ను తీసుకురానున్నారు. సకాలంలో పన్నులు కట్టే వారికి రిబేటులు ఇవ్వనున్నారు. కాగా, వ్యాపారాలు, మౌలిక వసతులకు సంబంధించి ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో భాగంగా కొత్తగా నైట్-ఎకానమీ పాలసీని ప్రవేశపెట్టనున్నారు. సింగిల్ ట్రేడ్ లైసెన్స్, భవన నిర్మాణాలకు డీమ్డ్ అప్రూవల్స్ ఇస్తారు. జీఐఎస్ ఆధారిత వీధుల అభివృద్ధి ప్రణాళికలు, అండర్ గ్రౌండ్ యూటీలిటీస్ ఏర్పాటు చేయనున్నారు. ప్రజల సౌకర్యార్థం రియల్ టైమ్ మానిటరింగ్ కోసం ‘క్యూర్ స్మార్ట్ గవర్నెన్స్ సెంటర్’ను, అన్ని సేవలకు ఒకే ఇంటిగ్రేటెడ్ డిజిటల్ పోర్టల్, ఒకే కన్సాలిడేటెడ్ యూటీలిటీ బిల్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఫిర్యాదుల వేగవంతమైన పరిషారానికి ‘క్యూర్ అప్పీలేట్ అథారిటీ’ రానున్నది.
ప్రస్తుత జీహెచ్ఎంసీ చట్టంలోని ప్రధాన అంశాలైన కార్పొరేషన్లు, స్టాండింగ్ కమిటీలు, వార్డు కమిటీలు, ఎన్నికలు తదితర అంశాల నిర్వహణ వంటి కోర్ నిబంధనలను అలాగే కొనసాగిస్తూనే.. మున్సిపల్ అథారిటీలలో ట్రాన్స్ జెండర్ సభ్యుడికి చోటు కల్పించనున్నారు. ఎన్నికల అనర్హత వేటు నిబంధనలను తొలగిపోనున్నాయి. ప్రజారోగ్య అత్యవసర అధికారాలు, సఫాయి కర్మచారి చట్టానికి అనుగుణంగా పారిశుధ్య నిర్వహణ, జలమండలి పరిధిలోకి నీరు, మురుగునీటి నియంత్రణ అధికారాలను బదిలీ చేయనున్నారు. ఈ డ్రాఫ్ట్ బిల్లుపై ప్రజలందరూ తమ అమూల్యమైన సూచనలు అందించాలని ఈ సందర్భంగా ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
ప్రజాస్వామ్యయుతంగా, అందరి భాగస్వామ్యంతో ఈ చట్టాన్ని తీసుకురావాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఈ ముసాయిదా బిల్లును ప్రజల ముందుకు తీసుకువచ్చింది. ఆసక్తి పౌరులు, నివాసితుల సంక్షేమ సంఘాలు, పారిశ్రామిక సంస్థలు, నిపుణులు, స్వచ్ఛంధ సంస్థలు తమ సలహాలను ఆన్లైన్ https://ghmc.gov.in/ category WiseInsertReport.aspxలో సూచనలు నమోదు చేయవచ్చు. ఈ ముసాయిదా బిల్లు పూర్తి ప్రతిని ట్రై కార్పొరేషన్లలో అధికారిక వెబ్సైట్లలో అందుబాటులో ఉంచారు. సచివాలయంలోని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లిఖిత పూర్వకంగా అందజేయవచ్చు. ఆఖరి గడువును ఈ నెల 24 వరకు విధించారు.
సిటీబ్యూరో, జులై 5(నమస్తే తెలంగాణ): మహాననగర పరిధిలో కోటిన్నర మంది ప్రజల భవిష్యత్‌ను, స్థానిక స్వపరిపాలనను శాసించే అత్యంత కీలకమైన కోర్ అర్బన్ రీజియన్ బిల్లు-2026 ముసాయిదాను ప్రభుత్వం అత్యంత రహస్యంగా ఉంచిందని పబ్లిక్ పాలసీ నిపుణులు డా. దొంతి నరసింహారెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సుమారు 271 పేజీలు ఉన్న ఈ భారీ ముసాయిదా బిల్లును ప్రజలకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా జీహెచ్ఎంసీ వెబ్సైట్లో కేవలం ఆన్లైన్ రీడింగ్ కోసం మాత్రమే ఉంచడం వెనుక ఉన్న వ్యూహామేంటనీ ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం ఆయన పురపాలన, పట్టణాభివృద్ధి ప్రిన్సిపల్ సెక్రటరీ, జీహెచ్ఎంసీ కమిషనర్‌కు ఒక ఘాటైన లేఖ రాశారు.
ప్రస్తుతం ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం-1995ను సవరించడమే కాకుండా, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లను కలుపుతూ.. ఒకే ఒక్క మెట్రోపాలిటన్ గవర్నెన్స్ పరిధిలోకి తీసుకురావడానికి ఈ బిల్లును రూపొందించారు. దీని ద్వారా క్యూర్ స్మార్ట్ గవర్నెన్స్ సెంటర్, క్యూర్ అప్పిలేట్ అథారిటీ వంటి కొత్త వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు. దాదాపు 1.3 కోట్ల మంది జనాభాపై ప్రభావం చూపే ఇంతటి సుదీర్ఘమైన సంస్కరణలపై కనీస పద్ధతి లేకుండా ప్రజాభిప్రాయాన్ని కోరడం ప్రజాస్వామ్య విరుద్ధమని లేఖలో పేర్కొన్నారు.
హైదరాబాద్ నగరంలో అత్యధిక సంఖ్యాకులు తెలుగు మాట్లాడేవారే ఉన్నారని, కానీ ఈ 271 పేజీల కీలక ముసాయిదాను కేవలం ఆంగ్లంలో మాత్రమే అందుబాటులో ఉంచారని నరసింహారెడ్డి ధ్వజమెత్తారు. సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా దీనిని తెలుగులోకి ఎందుకు అనువదించలేదన్నారు. ఈ డాక్యుమెంట్‌ను డౌన్లోడ్ చేసుకోవడానికి గానీ, ప్రింట్ తీసుకోవడానికి గానీ వీల్లేకుండా కేవలం వెబ్సైట్ బ్రౌజర్‌లోనే చూసేలా సాంకేతిక ఆంక్షలు విధించడం సరికాదన్నారు. కంప్యూటర్ స్క్రీన్లపై పేజీల కొద్దీ చదివి విశ్లేషించడం సామాన్యులకు సాధ్యం కాదన్నారు.
ప్రజాభిప్రాయాలు, సూచనలు, పంపడానికి చివరి తేదీ ఏదీ? ఎవరికి పంపాలి.? ఏ రూపంలో పంపాలనే ప్రాథమిక వివరాలేవి వెబ్సైట్లో స్పష్టంగా పేర్కొనకపోవడం గమనార్హం. కేవలం పేరుకే ప్రజాభిప్రాయ సేకరణ అని చూపిస్తూ, ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకత రాకుండా ముందస్తు ప్రణాళికతోనే ఇలాంటి గోప్యత పాటిస్తున్నారని విమర్శించారు. తెలుగు, ఇంగ్లిష్ ప్రముఖ దినపత్రికల్లో ముసాయిదాపై స్పష్టమైన నోటిఫికేషన్ ఇవ్వాలి. బిల్లును తక్షణమే తెలుగులోకి అనువదించి అధికారికంగా ప్రచురించాలి. ప్రజలు చదువుకోవడానికి వీలుగా పూర్తిగా పీడీఎఫ్ కాపీని వెబ్సైట్లో పెట్టాలన్నారు. ప్రజాభిప్రాయల సమర్పణకు కనీసం 60 రోజుల సమయం ఇవ్వాలన్నారు. వార్డు, జోనల్ స్థాయిలో బహిరంగ సదస్సులు నిర్వహించి ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించాలన్నీ, ప్రజలు సమర్పించిన అభిప్రాయాలపై రశీదు ఇవ్వడంతోపాటు, వాటిని ఏ విధంగా పరిగణనలోకి తీసుకున్నారో నివేదిక రూపంలో వెల్లడించాలన్నారు.