హైదరాబాద్: హైదరాబాద్‌లో మరోసారి భూముల వేలానికి (E-Auction) ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఐటీ కంపెనీలకు నెలవైన గచ్చిబౌలికి అత్యంత సమీపంలోని రాయదుర్గంలో (Raidurg) ఖాళీగా ఉన్న భూములను వచ్చే నెల 6న ఈ-వేలం వేస్తున్నది. ఒక్కో ఎకరాకు ప్రారంభ ధర రూ.101 కోట్లుగా నిర్ణయించింది. అత్యంత ఖరీదైన 18.67 ఎకరాల ప్రభుత్వ భూమి వేలానికి ఏర్పాట్లు చేస్తున్నది. తద్వారా కనీసం రూ.2వేల కోట్లు తక్కువ కాకుండా ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నది. సర్వే నంబర్ 83/1లో ప్లాట్ నంబర్ 19లో 11 ఎకరాలు.. అదే సర్వే నంబర్లో ప్లాట్ నంబర్ 15ఎ/2లో 7.67 ఎకరాలను వేలం వేయనున్నది. దీనికి సంబంధించి టీజీఐఐసీ ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే నెల 1వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు బిడ్ దాఖలు చేయవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.1,180, బిడ్ డాక్యుమెంట్ ఫీజు ప్రతి ప్లాట్‌కు రూ.10 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అక్టోబర్ 6న మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ వేలం నిర్వహిస్తారు.
బిడ్ దాఖలుకు చివరి తేదీ: అక్టోబరు 1- సాయంత్రం 5 గంటల వరకూ..
రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.1,180 (జీఎస్టీ సహా, నాన్ రిఫండబుల్)
బిడ్ డాక్యుమెంట్ ఫీజు: ప్రతి ప్లాట్‌కు రూ.10 లక్షలు+ జీఎస్టీ అదనం (నాన్ రిఫండబుల్)
రిజర్వ్ ధర: ప్లాట్ నం.11 ఎకరాలు (రిజర్వ్ ధర: రూ.101 కోట్లు ఎకరాకు), ప్లాట్ నం.15ఎ/2. 7.67 ఎకరాలు(రిజర్వ్ ధర: రూ.101 కోట్లు ఎకరాకు)
బిడ్ పెంపు: కనీసం రూ.50 లక్షలు ఎకరాకు లేదా దాని గుణింతాలుగా
భూమి సందర్శనకు గడువు: అక్టోబర్ 04 వరకు
ఈ-వేలం: అక్టోబర్ 6న మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు