సికింద్రాబాద్, జనవరి 30: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. అన్ని వర్గాలకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందించేందుకు గాను రాష్ట్రం ఎక్కడా లేని విధంగా ముందడుగు వేస్తుందన్నారు. కంటోన్మెంట్ ప్రాంతంలో ఉచిత తాగునీటి పథకం అమలుకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోద ముద్ర వేసిన నేపథ్యంలో రెండో రోజు కంటోన్మెంట్ వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ నేతలతో పాటు స్థానికులు సంబురాలు జరుపుకున్నారు. బోయిన్పల్లిలోని కంటోన్మెంట్ ప్లే గ్రౌండ్ వద్ద బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు మంత్రి మల్లారెడ్డి ఆదివారం క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో సీఎం కేసీఆర్ తరువాతే ఎవరైనా.. అని కేసీఆర్ సేవల్ని కొనియాడారు. జీహెచ్ఎంసీలో మాదిరిగానే కంటోన్మెంట్లో ఉచిత తాగునీటికి గ్రీన్ సిగ్నల్ రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. 75 ఏండ్లుగా కంటోన్మెంట్లో అభివృద్ధి కుంటుపడిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఏడేళ్లలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ కంటోన్మెంట్ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో అమలవుతున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్లతో పాటు ఎన్నో సంక్షేమ పథకాలు కంటోన్మెంట్లో అమలుకు నోచుకుంటున్నాయని తెలిపారు. కంటోన్మెంట్ ప్రజలకు గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుందన్నారు. ఈ ప్రాంతంలో అభివృద్ధికి సర్కారు కట్టుబడి ఉందని, ఇందులో భాగంగానే స్కైవేల నిర్మాణం, రోడ్డు విస్తరణ వంటి పనులకు త్వరలోనే మోక్షం కలగనుందన్నారు. ఉచిత తాగునీటి పథకం అమలుకు ఎమ్మెల్యే సాయన్న, మర్రి రాజశేఖర్రెడ్డి, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి, బోర్డు మాజీ సభ్యులు ఎంతో కృషి చేశారని అన్నారు. కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యులు పాండు యాదవ్, ప్రభాకర్, నళినీ కిరణ్, శ్యామ్ కుమార్, నేతలు నివేదితా, టీఎన్ శ్రీనివాస్, ముప్పిడి మధూకర్, తేజ్పాల్, నర్సింగరావు, విజయ్, శ్రీధర్, సురేష్, సంపత్తో పాటు స్థానిక నేతలు పాల్గొన్నారు.