తినడానికి మెతుకు లేదు కానీ, మీసాలకు సంపెగ నూనె చందంగా మెట్రో స్వాధీన ప్రక్రియ మారింది. అనువుగానీ బరువును నెత్తిన వేసుకున్న కాంగ్రెస్ సర్కార్.. నోరు తెరిస్తే ఖజానా ఖాళీ అని చెప్పుకొంటూ, సంక్షేమ పథకాలకు పాతరేసి, రూ. 15 వేల కోట్ల మెట్రో భారాన్ని జనాలపై మోపనున్నది. ప్రజలపై పడే ఆర్థిక భారాన్ని అంచనా వేయని సర్కార్.. ఎల్ అండ్ టీ సంస్థలకు అడగకుండానే మినహాయింపులనిస్తోంది. దీనికోసం ఎల్ అండ్ టీ ఈక్విటీని 100శాతం కొనుగోలు చేసేందుకు, ఇతర ఖర్చుల కోసం రూ. 1385 కోట్లను హెచ్ఎండీఏ నుంచి సేకరించనున్నది. మిగిలిన రూ. 13, 615 కోట్లను ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి సేకరించనున్నది. లోన్ రీపేమెంట్ విషయంలో వచ్చే సమస్యలకు ఆటో డెబిల్ చేసుకునే అధికారాన్ని ఆర్బీఐకి కల్పిస్తున్నది. – సిటీబ్యూరో
ఎల్ అండ్ టీకి మినహాయింపులు..
ఎల్అండ్టీ సంస్థ మెట్రో ప్రాజెక్టును వదిలించుకోవాలని చూస్తుంటే, దాన్ని కాంగ్రెస్ సర్కార్ అత్యుత్సాహంతో నెత్తిన వేసుకున్నది. ముఖ్యంగా జీహెచ్ఎంసీకి కట్టాల్సిన వందలాది కోట్ల ఆస్తి పన్ను బకాయిల నుంచి మినహాయించింది. పాత బకాయిల విషయంలో సర్కార్ వ్యవహరించిన తీరు ఇప్పుడు విస్మయానికి గురిచేస్తోంది. స్థలం ప్రభుత్వానిదే కదా అనే సాకుతో కోట్లాది రూపాయల పన్ను రాబడిని వదులుకోనున్నది. ఇక ఇప్పటికే ఎల్ అండ్ టీ ఇచ్చిన రూ. 900 కోట్ల వడ్డీ లేని రుణం విషయంలో ఉదారంగా వ్యవహరించింది. ఈ మొత్తాన్ని కొనుగోలు ధర నుంచి మినహాయించకుండా సంస్థ ఖాతాల్లోనే రుణంగా కొనసాగించేలా వెసులుబాటు కల్పించింది. సంస్థకు చెల్లించాల్సి మొత్తాన్ని తగ్గించకుండా, అదనపు భారాన్ని రాష్ట్ర సర్కార్ మోసేందుకు సిద్ధపడింది.
హెచ్ఎండీఏ నిధులు..
నగరాభివృద్ధికి వెచ్చించాల్సిన వందలాది కోట్ల రూపాయలను హెచ్ఎండీఏ నుంచి సేకరించి, వాటితో ఎల్ అండ్ టీ ఈక్విటీని కొనుగోలు చేయనున్నది. సుమారు రూ. 1385 కోట్లను హెచ్ఎండీఏ ద్వారా సమకూర్చనుండగా, మిగిలిన రూ. 13615 కోట్లను ఐఆర్ఎఫ్సీ నుంచి అప్పుగా తెస్తోంది. మెట్రో ఫేజ్-1 స్వాధీనమే గుదిబండలా ఉంటే, ఇక నిర్వహణ ఖర్చులు అదనపు భారంగా మారనున్నాయి. ఎల్ అండ్ టీకి చెందిన 115 మంది ఉద్యోగుల జీతభత్యాలను ఏడాదిపాటు ప్రభుత్వమే భరించాల్సి ఉంది. అటు అప్పులకు వడ్డీలు, ఇటు నిర్వహణ ఖర్చులు వెరసి, మెట్రోను లాభాల్లోకి తెస్తామని చెబుతున్న సర్కారు మాటలు ఆచరణకు సాధ్యం కాదనీ నిపుణులు కొట్టిపారేస్తున్నారు. ఏప్రిల్ 30 నాటికి ఈ లావాదేవీలన్నీ ముగించాలని గడువు విధించగా, చివరకు రాష్ర్టాన్ని అప్పుల కుప్పగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నది.