సిటీబ్యూరో, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): ప్రజాపాలనలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఒకేసారి ఐదుగురు మరణిస్తే కనీసం వారి కుటుంబాలకు ధైర్యం చెప్పేందుకు ఒక్క మంత్రికి కూడా తీరిక లేకుండా పోయిందంటూ రామంతాపూర్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాంధీ దవాఖాన వద్దకు వెళ్లి అక్కడ మృతుల బంధువులతో మాట్లాడిన ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు ప్రభుత్వం తరపున రూ. 5 లక్షల పరిహారం ప్రకటించి అక్కడితోనే చేతులు దులుపుకోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రామంతాపూర్, గోఖలేనగర్‌లో యాదవ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి నిర్వహించిన శ్రీకృష్ణజన్మాష్టమి వేడుకల సందర్భంగా రథానికి విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే ఐదుగురు మృతిచెందిన విషయం నగరంలో తీవ్ర విషాదాన్ని నింపింది. విష యం తెలుసుకొని ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఘటనా స్థలికి వెళ్లి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.
విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగింది, ప్రతి నెలా ప్రజల నుంచి ముక్కుపిండి విద్యుత్ చార్జీలు వసూలు చేస్తున్న ప్రభుత్వం, విద్యుత్ తీగల నిర్వహణను పట్టించుకోకపోవడంతోనే ఘోర ప్రమాదం జరిగిందని మృతుల కుటుంబాలను ఆదుకోవాలంటూ సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు స్థానికులు ఆం దోళన చేశారు.
ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ఇతర రాష్ర్టాలకు చెందిన కార్మికులు ప్రమాదవశాత్తు మృతి చెందిన సమయాల్లో ముఖ్యమంత్రి, మంత్రులు ఆయా ఘటనా స్థలికి వెళ్లిన సందర్భాలున్నాయి. అలాంటిది రామంతాపూర్‌లో విద్యుత్ షాక్‌కు గురై ఐదుగురు మృతి చెందడం, నలుగురు గాయాలకు గురి అయిన ఘటనపై రాష్ట్ర మంత్రులు తేలికగా తీసుకోవడంపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తీరిక లేకనా.. లైట్ తీసుకున్నారా?
తాము ప్రజాపాలన చేస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు… హైదరాబాద్‌లో ప్రమాదం జరిగితే ఘటన స్థలికి వెళ్లే తీరిక లేకుండా ఉన్నారా? ఘటన విషయాన్ని తేలికగా తీసుకున్నారా? అనే అంశంపై స్థానికంగా చర్చించుకుంటున్నారు. స్థానిక ప్రజలు ప్రమాదాలకు గురైతే వారికి కనీస భరోసా ఇవ్వని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభు త్వ పెద్దలు ఉండడంపై అధికార పార్టీలోనే కొందరు నాయకులు పెదవి విరుస్తున్నారు.
ఘోర ప్రమాదం జరిగింది, దేవుడి వేడుకల్లో అపశ్రుతి జరిగింది.. అలాంటప్పుడు ఏమి జరిగిందో తెలుసుకునేంత తీరిక లేకుండా మంత్రులు ఉండ డం ఏంటంటూ నగర వాసులు ప్రశ్నిస్తున్నారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని ఆ శాఖ మంత్రి ఎక్కడున్నారని.. ఆయన ఎందుకు రాలేదంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రమాదంలో బిడ్డను కోల్పోయిన తల్లి దండ్రులు, భర్తను కోల్పోయిన భార్యలు, తండ్రిని కోల్పోయిన పిల్లలు ఉన్నారు. వారిని ఓదార్చి కనీసం సానుభూతి తెలుపాల్సిన ప్రభుత్వ పెద్దలు, సామాన్యుల ప్రాణాలకు విలువ ఇవ్వడం లేదంటూ నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాల్లో ఇతర రాష్ర్టాలకు చెందిన వారికి లక్షల్లో పరిహారం ఇచ్చిన ప్రభుత్వ పెద్దలు, హైదరాబాద్ వాసులను మాత్రం చిన్నచూపు చూస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.