బంజారాహిల్స్, జూన్ 19: పేదలు నివాసం ఉంటున్న బస్తీల్లో ఉచిత వైద్యం అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఒకవైపు వైద్యులు, మందుల కొరతతో రోగులు ఇబ్బందులకు గురవుతుంటే.. మరికొన్ని ప్రాంతాల్లో ఆరోగ్య కేంద్రాల అద్దె బకాయిలు పేరుకుపోవడంతో యజమానుల నుంచి ఖాళీ చేయాలంటూ ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయి. సుమారు ఏడాదినుంచి అద్దె బకాయి ఉండటంతో జూబ్లీహిల్స్ రోడ్ నం.5 జవహర్ కాలనీలోని పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఖాళీ చేయాలంటూ యజమాని అనేక రకాలుగా ఒత్తిళ్లు తీసుకువస్తున్నారు.
సమస్యను పరిష్కరించాల్సిన జిల్లా వైద్యశాఖ అధికారులు తమకు ఏం సంబంధం లేనట్లు వ్యవహరిస్తుండటంతో స్థానికంగా పనిచేస్తున్న వైద్యసిబ్బంది రోగులకు సేవలు అందించేది లేదంటూ మొండికేస్తున్నారు. అరకొర సౌకర్యాలతో తాము రోగులకు సేవలు అందించడం కష్టమని, ఓపీ సేవలు నిలిపివేయాలని ఉన్నతాధికారులనుంచి ఆదేశాలు వచ్చాయంటూ వారం రోజులుగా జవహర్ కాలనీ పట్టణ ఆరోగ్య కేంద్రంంలో ఔట్ పేషెంట్ సేవలు ఆపేశారు. వివిధ రకాలైన ఆరోగ్య సమస్యలతో వచ్చేవారిని ఇందిరానగర్‌లోని బస్తీ దవాఖానాకు, 3 కిలోమీటర్ల దూరంలోని షౌకత్నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలంటూ పంపించి వేస్తున్నారు.
రూ.2.5లక్షల మేర బకాయి..
దాదాపు 10ఏళ్లుగా జవహర్‌నగర్‌లో అద్దె భవనంలో కొనసాగుతున్న ఆరోగ్య కేంద్రానికి సంబంధించి సుమారు రూ.2.5లక్షల మేర అద్దె బకాయి ఉంది. దీంతో ఏడాది నుంచి అద్దె కోసం యజమాని ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. అద్దె రాకపోవడంతో నీటి సరఫరా ఆపేశారు. దీంతో అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి కాలకృత్యాలు తీర్చుకునేందుకు సైతం నీరు లేని పరిస్థితి. ఇక్కడ ఇన్చార్జి డాక్టర్‌తో పాటు ముగ్గురు ఏఎన్ఎమ్లు, స్టాఫ్ నర్స్, డీవో, సూపర్వైజర్, అటెండర్, స్వీపర్ సహా 10 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఇంటి యజమాని నీటి సరఫరా నిలిపివేయడంతో అప్పుడప్పు డు కరెంట్ సరఫరా కూడా ఆపేస్తుండటంతో ఇబ్బందులుఎదుర్కొంటున్నారు.
చేతులెత్తేసిన జిల్లా అధికారులు..?
జవహర్ కాలనీ పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఉన్న అద్దె సమస్యలతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాల్సిన జిల్లా వైద్యశాఖ అధికారి డా.వెంకటితో సహా మిగిలిన అధికారులు చేతులెత్తేశారా.. అంటే అవును అనే సమాధానాలు వినిపిస్తున్నాయి. నెలరోజుల క్రితం పట్టణ ఆరోగ్యకేంద్రాన్ని సందర్శించిన డా.వెంకటికి స్థానికులతో పాటు సిబ్బంది సమస్యలను ఏకరువు పెట్టారు. కిరాయి కోసం యజమాని చేస్తున్న ఒత్తిళ్లు.
నీటి సరఫరా కట్ చేసిన వైనాన్ని వివరించారు. అయితే ఇవేవీ పట్టించుకోని సదరు అధికారి ఇక్కడినుంచి పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని వేరేచోటకు మార్చుకోండి అంటూ ఉచిత సలహా ఇచ్చి వెళ్లిపోయారు. దీంతో స్థానికంగా ఏదైనా భవనంలోకి మార్చుకోవాలని ఉద్యోగులు ప్రయత్నిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. స్థానికంగా ఉన్న కమ్యూనిటీహాల్లోకి తాత్కాలికంగా పీహెచ్‌సీని మార్చేందుకు అనుమతి ఇవ్వాలంటూ స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ వెల్దండ వెంకటేశ్ లేఖలు రాశారు. అయితే సర్కిల్ 18 డీఎంసీ మాత్రం ఇప్పటిదాకా కమ్యూనిటీహాల్ కేటాయింపు వ్యవహారంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ఓపీ సేవలు నిలిపివేత..
ఒకవైపు యజమాని ఒత్తిళ్లు, మరోవైపు రోగుల తాకిడితో విసిగిపోయిన వైద్య సిబ్బంది ఓపీ సేవలు నిలిపివేశారు. రోజుకు సుమారు 100 నుంచి 150మంది వివిధ సమస్యలతో ఆరోగ్య కేంద్రానికి వస్తుంటారు. వారిని వెనక్కి పంపుతుండటంతో బస్తీ దవాఖానాకు వెళ్లలేక, 3 కిలోమీటర్ల దూరంలోని షౌకత్నగర్ పీహెచ్‌సీకి వెళ్లలేక రోగులు, గర్భిణులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి జవహర్ కాలనీ పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఓపీ సహా అన్ని సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉందని, డెంగీ తదితర సమస్యలతో ప్రాణాలు పోయే పరిస్థితి ఉన్న తరుణంలో పీహెచ్ఎంసీని మూసేసే ప్రయత్నాలు చేస్తే ఊరుకునేది లేదంటూ స్థానికులు హెచ్చరించారు.