మేడ్చల్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ పథకాన్ని జీహెచ్ంఎసీ నియోజకవర్గాలో ఎప్పుడు వర్తింపు చేస్తారంటూ దరఖాస్తుదారులు ప్రశ్నిస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని జీహెచ్ంఎసీ పరిధిలో.. మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలలో ఇందిరమ్మ పథకాన్ని ఇప్పటివరకు ప్రభుత్వం వర్తింపజేయలేదు. జిల్లాలోని మేడ్చల్ నియోజకవర్గానికి మాత్రమే ఇందిరమ్మ పథకాన్ని వర్తింపజేసింది. దీంతో నాలుగు నియోజకవర్గాలలో ఇందిరమ్మ పథకానికి దరఖాస్తులు చేసుకున్న 2.5 లక్షల మందికి ఇందిరమ్మ ఇంటి పథకం కోసం ఎదురుచూపులు తప్పడం లేదు.
జనవరి 15న ప్రారంభమైన ఇందిరమ్మ పథకం నేటికి 9 నెలలు గడుస్తున్నా జీహెచ్ంఎసీ పరిధిలో ఎందుకు అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తు ప్రభుత్వంపై మండి పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించి ఇందిరమ్మ ఇంటి పథకానికి దరఖాస్తులను స్వీకరించింది. ప్రతి నియోజకవర్గానికి మొదటి దశలో 3,500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ఆ దిశగా అడుగులు మాత్రం వేయలేదు.
మేడ్చల్లో 1,773 ఇండ్లు మంజూరు..
జిల్లాలోని మేడ్చల్ నియోజకవర్గంలో మాత్రమే ఇందిరమ్మ పథకాన్ని ఎదో నామేకా వాస్తేగా అమలు చేస్తున్నారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 1,773 ఇందిరమ్మ ఇండ్లను మాత్రమే మంజూరు చేశారు. ఇందులో 900 ఇండ్లు గ్రౌండింగ్ కాగా 600 ఇండ్లు బేస్మిట్లు పూర్తికాగా మరో 200 రూఫ్లెవల్, స్లాబుల వరకు మాత్రమే వచ్చాయి.
అయితే జీహెచ్ంఎసీ పరిధిలోని అన్ని నియోజకవర్గాలలో సుమారు 10 లక్షల దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో ఇంతమందికి ఇల్లు ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చనే ఉద్దేశ్యంతోనే జీహెచ్ఎంసీ నియోజకవర్గాలలో ఇందిరమ్మ పథకాన్ని అమలు చేయడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాక జీహెచ్ఎంసీ పదవీ కాలం పూర్తవుతున్న క్రమంలో ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తులు చేసుకున్న వారందరికి రానట్లయితే జీహెంచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత వస్తుందన్న ఆలోచనతోనే ప్రభుత్వం ఇందిరమ్మ ఇంటి పథకాన్ని అమలు చేయడం లేదనే వాదనా లేకపోలేదు.