మేడ్చల్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం మాన్సూన్ నిధులను విడుదల చేయకపోవడంతో వరద నివారణ చర్యలు ఎట్ల అన్న ప్రశ్న ఉదయిస్తున్నది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని జవహర్‌నగర్, బోడుప్పల్, పీర్జాదిగూడ, నిజాంపేట్ కార్పొరేషన్లు, మేడ్చల్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్కేసర్, కొంపల్లి, దుండిగల్, మూడుచింతలపల్లి, ఎల్లంపేట్, అలియాబాద్ మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు 16 మున్సిపాలిటీల్లో వరద పోటెత్తుతున్నది.
అయితే ప్రభుత్వం మాన్సూన్ నిధులను సకాలంలో విడుదల చేయకపోవడంతో సహాయక చర్యలు చేపట్టడంలో అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేసింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నిధులు విడుదల చేయడంలో తాత్సారం చేస్తోంది. ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్స్‌ల ద్వారా వచ్చే ఆదాయంతోనే మున్సిపాలిటీల నిర్వహణ అంతంతమాత్రంగానే కొనసాగుతుండగా.. ప్రస్తుతం వరద నివారణ చర్యలు చేపట్టలేకపోతున్నది.
కొత్త మున్సిపాలిటీల్లో పరిస్థితి ఘోరం..
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో కొత్తగా ఏర్పాటైన మూడు మున్సిపాలిటీల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. జిల్లాలో ఇటీవలే మూడుచింతలపల్లి, ఎల్లంపేట్, అలియాబాద్ మున్సిపాలిటీలుగా ఏర్పడ్డాయి. ఇంకా ఇక్కడ పూర్తిస్థాయి అధికారులను నియమించలేదు. ఇన్‌చార్జీలతోనే పాలనను నెట్టుకొస్తున్నారు. ప్రసుత్తం కురుస్తున్న వర్షాలతో వరద నివారణ చర్యలు తీసుకునేందుకు నిధులు లేకపోవడంతో ఏం చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.మరోవైపు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుండటంతో సమస్య పరిష్కారానికి ఏ అధికారిని కలువాలో స్థానికులకు అర్థం కావడం లేదు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో వరద నీటి సమస్య పరిష్కారానికి మున్సిపాలిటీలలో ఉన్న నిధులనే ఉపయోగించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అత్యవసర పరిస్థితులు వస్తే ముందుగా మున్సిపాలిటీలలోని నిధులను వినియోగించి తర్వాత ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించి నిధులను రాబట్టుకోవాలని సూచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికైతే నాలాల పూడికతీత, ఇతర చిన్న చిన్న సమస్యలకు ఎలాంటి ఇబ్బందులు లేకున్నా.. అత్యవసర పరిస్థితులు తలెత్తితే ఏం చేయాలన్నది ఆధికారులకు పాలుపోవడం లేదు.