Devaryamjal | మేడ్చల్, డిసెంబర్ 30(నమస్తే తెలంగాణ): త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా దేవాదాయ భూముల పరిశీలనకు అధికార యంత్రాంగం సిద్ధమవుతుంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని దేవరయాంజల్లో ఉన్న 1350 ఎకరాల దేవాదాయ భూములను పరిశీలించేలా చర్యలు తీసుకునేందుకు ముందుకు వెళ్తున్నామని చెబుతున్నప్పటికీ ఆచరణలో అమలు చేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దేవాదాయ శాఖ భూములు కబ్జాకు గురైన నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భూములను రక్షించేందుకు త్రిసభ్య కమిటీని ఐఏఎస్ అధికారుల బృందంతో నియమించింది. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించి దేవరయాంజల్లో ఉన్న 1350 ఎకరాలు దేవాదాయ శాఖ భూములేనని, ఆ భూముల్లో నిర్మించినవి అక్రమమేనని తేల్చిన విషయం విధితమే. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకునే క్రమంలో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నేపథ్యంలో అప్పట్లో చర్యలు తీసుకునే అవకాశం లేకుండా పోయింది. ఇదే అదునుగా మరికొంత మంది దేవాదాయ భూములను కబ్జాలు చేస్తూ నిర్మాణాలు చేపడుతున్నారు. దేవరయాంజల్లో పురాతనమైన శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం ఉంది.
నిజాం హయాంలో ఓ భక్తుడు ఆలయానికి 1500 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చాడు. విరాళంగా అందించిన భూమి సర్వే నం.55 నుంచి 63, 639- 631, 656, 657, 660-682, 686-718, 736 అయిన 1500 ఎకరాల భూమిని 1925 సంవత్సరం వరకు శ్రీ సీతారామచంద్రస్వామి పేరిట రికార్డుల్లో ఉంది. క్రమ క్రమంగా సీతారామరెడ్డి, సీతారామారావు, సీతారాములుగా మారిపోయి కబ్జాదారుల పేరిట రికార్డులకు వచ్చాయి. ఇప్పుడు ఆ భూముల్లో గోదాములు, రిసార్టులు, వాణిజ్య సముదాయాలు, నివాసాలు వెలిశాయి.
దేవాదాయ భూముల్లో నిర్మాణాలు చేసిన గోదాములు, రిసార్ట్లు, ఫంక్షన్‌హాళ్లు, వాణిజ్య సముదాయాలు నిర్మించుకుని వాటికి రూ.కోట్లలో అద్దెలు వసూళ్లు చేస్తున్నారు. నిర్మించిన వాటిలో కొందరు మాత్రమే తూంకుంట మున్సిపాలిటీకి ఆస్తి పన్నులు చెల్లిస్తున్నారు. మిగతా వారు ఆస్తి పన్నులు చెల్లించకుండా, వీరితో కుమ్మక్కైన మున్సిపల్ అధికారులకు నెలల వారిగా మాముళ్లు ఇస్తూ.. కోట్లాది రూపాయలు దోచుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.
దేవుడి మాన్యంలో అక్రమంగా నిర్మించే వాటిపై దృష్టి పెట్టకుండా తమకు వచ్చే ఆదాయంపై అధికారులు దృష్టి పెడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా దేవాదాయ భూములను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. దేవాదాయ భూములు, అక్రమ నిర్మాణాలను గుర్తించిన త్రిసభ్య కమిటీ నివేదిక చర్యలు తీసుకుంటే దేవాదాయ భూములు తిరిగి ఆలయానికి సొంతమవుతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
త్రిసభ్య కమిటీ ముమ్మటికీ దేవాదాయ శాఖ భూములేనని నివేదిక ఇచ్చినా అక్రమంగా వెలుస్తున్న నిర్మాణాలపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇటీవలే దేవాదాయ భూముల్లో 6 నూతన గోదాములు నిర్మించినా అధికారులు మాత్రం చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు కనపడుతోంది. ఇప్పటికే దేవాదాయ భూముల్లో కొన్ని ఎకరాలు కబ్జా కాగా, మిగతాది కబ్జా కాకుండా చూడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.