మేడ్చల్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): మాదారం ఇండస్ట్రియల్ పార్కు విస్తరణకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఇక్కడి రైతుల నుంచి సేకరించిన 186 ఎకరాల భూములకు రూ.60 కోట్ల పరిహారం చెల్లించిన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా రెవెన్యూ అధికారులు ఆ భూములను టీఎస్ఐఐసీకి అప్పగించారు. అయితే మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో టీఎస్ఐఐసీ సేకరించిన భూములకు అదనంగా మరో వంద ఎకరాలు తీసుకొని మాదారంలో భారీ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయాలని టీఎస్ఐఐసీ యోచిస్తున్నది. ఈ మేరకు రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. భూ సేకరణ పూర్తి కాగానే ఇండస్ట్రి లే అవుట్ పనులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ మాధవి తెలిపారు. మొత్తంగా 295 ఎకరాలలో పార్కును ఏర్పాటు చేస్తే వందలాది పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది.
భారీగా పరిశ్రమల ఏర్పాటు..
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు అనేక మంది పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్నారు. హైదరాబాద్కు సమీపంలో ఉన్న ఈ జిల్లాలో భారీగా మౌలిక వసతులుండగా.. ఇప్పటికే జిల్లాలో 15,459 పరిశ్రమలు న్నాయి. వివిధ జిల్లాలతో రోడ్ కనెక్టివిటీ ఉండటంతో పాటు పారిశ్రామిక రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యంతో పలువురు పారిశ్రామిక వేత్తలు తరలివస్తున్నారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఆన్లైన్లో 5524 మంది దరఖాస్తులు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
పార్కు రావడం సంతోషం..
మాదారం గ్రామ శివారులో ఇండస్ట్రియల్ పార్కు రావడం ఎంతో సంతోషం. పారిశ్రామిక పార్కుతో ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందడం ఖాయం. త్వరలో ఏర్పాటు కాబోయే పార్కును మరింత విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం శుభపరిణామం.
– నళ్లోల్ల యాదగిరి, మాదారం సర్పంచ్