Google Earth | మేడ్చల్, సెప్టెంబర్ 12(నమస్తే తెలంగాణ): గూగుల్ ఎర్త్ ద్వారా కేఎంఎల్ మ్యాప్‌ల నివేదికలను సిద్ధం చేసే పనిలో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమైంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఉన్న ప్రభుత్వ భూములను గూగుల్ ఎర్త్ కేఎంఎల్ ద్వారా గుర్తించనున్నారు.
ఈ కార్యక్రమం వేగవంతంగా పూర్తి చేసేలా జిల్లా కలెక్టర్ గౌతమ్ ఆదేశాలు ఇచ్చారు. గూగుల్ మ్యాప్‌లను సిద్ధం చేసిన నివేదికలను ఆర్డీవోల ఆమోదంతో జిల్లా కలెక్టరేట్‌కు త్వరలోనే చేరనున్నాయి. గూగుల్ మ్యాప్ నివేదికలను తహశీల్దార్లు సర్వేయర్లతో కలిసి సిద్ధం చేయనున్నారు. ప్రభుత్వ భూములు కబ్జాకు గురైనట్లయితే క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించి గూగుల్ మ్యాప్‌లో పొందుపర్చనున్నారు. ఇప్పటికే ప్రభుత్వ భూములు కబ్జాలకు గురైనట్లు అనేక ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే.
గూగుల్ ఎర్త్ కేఎంఎల్ ద్వారా ప్రభుత్వ భూములను గుర్తిస్తున్న క్రమంలో కబ్జాకు గురైన భూములు వివరాలు తేలే అవకాశం ఉంటుదని అధికారులు తెలిపారు. ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వారిని గుర్తించి వారికి నోటీసులిచ్చి క్రిమినల్ కేసులను నమోదు చేసే చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే అనేక భూములు అన్యాక్రాంతమవుతున్న దృష్ట్యా గూగుల్ మ్యాప్‌లో ప్రభుత్వ భూములను చేర్చుతున్నారు. దీంతో ప్రభుత్వ భూములు కబ్జాకు గురికాకుండా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.
గూగుల్ ఎర్త్ కేఎంఎల్ ద్వారా సిద్ధం చేయనున్న మ్యాపుల ద్వారా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఉన్న ప్రభుత్వ భూముల లెక్క తేలనుంది. జిల్లా వ్యాప్తంగా 5,195 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు గతంలో రెవెన్యూ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఇందులో ఎన్ని ఎకరాలు కబ్జాకు గురైందన్న విషయం తెలిపోనుంది.
బాలానగర్ మండలంలో 700 ఎకరాలు, శామీర్‌పేట్ మండలంలో 420, దుండిగల్ మండలంలో 425, మేడిపల్లి మండలంలో 900, ఘట్కేసర్ మండలంలో 500, కాప్రా మండలంలో 400, కీసర మండలంలో 417, కుత్బుల్లాపూర్ మండలంలో 600, బాచుపల్లి మండలంలో 360, ఉప్పల్ మండలంలో 333, మల్కాజిగిరి మండలంలో 113, మేడ్చల్ మండలంలో 37 ఎకరాలు ఉన్నట్లు రెవెన్యూ రికార్డులలో ఉంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో భూముల ధరలు విపరీతంగా పెరిగిన క్రమంలో ప్రభుత్వ భూములను కొం దరు కబ్జాలు చేసుకున్నారు. దీంతో అసలు ప్రభుత్వ భూమి ఎంత అక్రమణలకు గురైందన్న విషయం గూగుల్ ఎర్త్ కేఎంఎల్ ద్వారా తెలిపోనుంది.