బడంగ్పేట్, జూన్ 17: ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వ భూములు చెర వీడుతున్నాయి. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బాలాపూర్ తహసీల్దార్ ఇందిరా దేవి ఆధ్వర్యంలో డీటీ మహిపాల్ రెడ్డి, ఆర్ఐలు ప్రశాంతి, జమీల్.. బాలాపూర్ మండల పరిధిలో 10.25 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడంతో పాటు చుట్టూ ఫెన్సింగ్ వేయించారు. అధికారులు స్వాధీనం చేసుకున్న భూమి విలువ రూ.200 కోట్ల పైచిలుకు ఉంటుందని అధికారిక అంచనా.
గ్రామాలవారీగా స్వాధీనం చేసుకున్న భూమి వివరాలు..
మామిడిపల్లి సర్వే నంబర్ 240/1లో 30 గుంటలు, మల్లాపూర్ సర్వే నంబర్ 73లో 32 గుంటలు, జిల్లెల్లగూడలో సర్వే నంబర్ 155/1లో 33 గుంటలు, జిల్లెలగూడ సర్వే నంబరు 124లో 400 గజాలు, సర్వే నంబర్ 119లో 2 గుంటలు, అల్మాస్గూడ సర్వే నంబర్ 86/1లో 1.10 ఎకరాలు, మీర్పేట్ సర్వే నంబర్ 61లో 1.20, కుర్మల్‌గూడ సర్వే నంబర్ 80/3లో 4 గుంటలు, జల్పల్లి సర్వే నంబర్ 221లో 1.15 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న భూములన్నింటికీ చుట్టూ ఫెన్సింగ్ వేయించారు. ఇంకా స్వాధీనం చేసుకోవలసిన ప్రభుత్వ భూముల వివరాలు తేల్చవలసి ఉంది. అయితే రాజకీయ ఒత్తిడ్ల కారణంగానే పూర్తిస్థాయిలో ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోలేకపోతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ భూమి కబ్జాచేసేవారిపై చర్యలు
బాలాపూర్ మండల పరిధిలో 10.25 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ వేశాం. ఇంకా ప్రభుత్వ భూములను సర్వే చేయవలసి ఉంది. అయితే కొన్ని కోర్టు విభాగంలో ఉన్నాయి. కోర్టు వివాదం అయిపోయిన వెంటనే ఆ భూములను స్వాధీనం చేసుకుంటాం. భవిష్యత్‌లో మరిన్ని భూముల సర్వే నిర్వహిస్తాం. ప్రభుత్వ భూములు కబ్జా చేసేవారిపై కఠిన చర్యలు తప్పవు. -ఇందిరాదేవి, తహసీల్దార్, బాలాపూర్