సిటీబ్యూరో, మార్చి 22 (నమస్తే తెలంగాణ ): అపార అవకాశాల గనిగా ఉన్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంతో కాంగ్రెస్ సరారు చెలగాటమాడుతోంది. ఇప్పటికే ‘హైడ్రా’ పేరిట సాగించిన విధ్వంసంతో రెండేళ్లుగా కోలుకోలేని దెబ్బతిన్న నిర్మాణ రంగాన్ని.. ఇప్పుడు టీడీఆర్ ( ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్) ఉచ్చులో బిగించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. తాజాగా జారీ చేసిన జీవో 95 ద్వారా టీడీఆర్ నిబంధనలను సవరించి, బిల్డర్లు వీటిని కచ్చితంగా కొనుగోలు చేయాల్సిందేనన్న షరతులను పకాగా అమలు చేస్తూ తెర వెనుక భారీ దందాను నడిపిస్తోంది.
ముఖ్యనేత అనుచరుల్లోకి వెళ్లిన టీడీఆర్‌లకు కృత్రిమ డిమాండ్ కల్పించేందుకే ఈ ఎత్తుగడ వేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సవరణ రియల్ ఎస్టేట్ రంగానికి ఆశించిన స్థాయిలో లబ్ధి జరగకపోగా, టీడీఆర్ బ్లాక్ మార్కెట్ దందా జోరుగా సాగి.. బిల్డర్లు, కొనుగోలుదారులపై అదనపు భారం తప్పదనే సంకేతాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలో అత్యంత పారదర్శకంగా టీడీఆర్ బాండ్ల జారీ ఉంటే..గడిచిన రెండేండ్లుగా ఒకరిద్దరి చేతుల్లోకి వెళ్లి కృత్రిమ కొరతతో బ్లాక్ మార్కెట్ దందాగా మార్చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సులభంగా దొరికిన టీడీఆర్…కాంగ్రెస్ హయాంలో ఆర్టిఫిషియల్ డిమాండ్‌ను సృష్టిస్తోంది.
50 శాతం టీడీఆర్ కట్టాల్సిందే..
జనవరి 16న ఇచ్చిన జీవో 16పై నిర్మాణ రంగం నుంచి వెల్లువెత్తిన వ్యతిరేకతతో పలు సవరణతో జీవో నం 95ను జారీ చేసింది. ఐతే టీడీఆర్‌లో 50శాతం నిర్మాణ అనుమతి సమయంలో, మిగిలిన 50శాతం ఆక్యుపెన్సీ వచ్చే ముందు సమర్పించాలని చెబుతోంది. దీని ద్వారా మొదటి నుంచి టీడీఆర్ కోసం బిల్డర్ వెతుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక బిల్డింగ్ చివర దశకు వచ్చే నాటికి టీడీఆర్ వ్యాపారులు ధరలను ఆమాంతం పెంచితే దానిపై వచ్చే అదనపు లోడ్ కూడా చివరకు కొనుగోలుదారుడిపైనే పడనున్నది.
చదరపు అడుగుకు వందల రూపాయల భారం పెరగనుండటంతో సొంతింటి కల మరింత భారం కానున్నది. మొత్తానికి ‘హస్తం’ పాలనలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మసకబారడమే కాకుండా, రియల్ రంగం దళారుల చేతుల్లో బందీ అవుతోందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు 18 మీటర్ల ఎత్తు ఉంటే భారీ భవనంగా (హైరైజ్) పరిగణించేవారు. ఇకపై ఆ పరిమితిని 21 మీటర్లకు పెంచారు. అయితే చిమ్నీలు, వాటర్ ట్యాంకులు, లిఫ్ట్ గదులను ఈ ఎత్తు పరిమితి నుంచి మినహాయించారు.
కాగా, గత జనవరిలో ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం.. 10 అంతస్తుల పైన నిర్మించే ప్రతి భవనంలో, ఆ పైన ఉండే బిల్డప్ ఏరియాలో 10 శాతం కచ్చితంగా టీడీఆర్ ద్వారానే భర్తీ చేయాలని నిబంధన విధించింది. దీనివల్ల చదరపు అడుగుకు రూ.350 నుంచి రూ.400 వరకు భారం పడుతుందని, ఇది సామాన్య కొనుగోలుదారుడిపై ప్రభావం చూపుతుందని బిల్డర్లు గొంతు ఎత్తారు. నగరమంతటా ఒకే రకమైన నిబంధనలు పెట్టడం సరికాదని వాదించారు.
ఈ ఒత్తిడి పనిచేయడంతో ప్రభుత్వం తాజాగా స్లాబ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఈ జీవో95లోని రూల్ నం. 17(ఎఫ్) ప్రకారం హైరైజ్ భవనాల ఎత్తును బట్టి అదనపు నిర్మాణ విస్తీర్ణంపై టీడీఆర్ భారం వేశారు. 10 నుంచి 20 అంతస్తుల వరకు ఉంటే..10వ అంతస్తు పైబడి ఉన్న విస్తీర్ణంలో 3 శాతం టీడీఆర్ వాడాలి. 20 అంతస్తులు దాటితే.. ఆ పైన ఉన్న విస్తీర్ణంలో 5 శాతం టీడీఆర్ లోడ్ చేయాలి. ఇలా టీడీఆర్‌ను తప్పనిసరి చేయడం ద్వారా బిల్డర్లపై భారం మోపి, ఆ మొత్తాన్ని ముఖ్యనేత బంధువులు, అనుచరుల జేబుల్లోకి మళ్లించే భారీ సెచ్ వేశారని విమర్శలు వస్తున్నాయి.
‘సెట్ బ్యాక్ ’ల పేరిట భద్రతతో రాజీ?
హైరైజ్ భవనాల్లో 10 శాతం వరకు సెట్ బ్యాక్ సడలింపులను టీడీఆర్ ద్వారా అనుమతించడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెట్ బ్యాక్ తగ్గించినా, టీడీఆర్ సమర్పిస్తే అనుమతులు ఇచ్చేలా నిబంధన మార్చడం ద్వారా.. టీడీఆర్‌ను ‘సర్వ రోగ నివారిణి’గా మార్చేశారు. ఇది భవిష్యత్తులో అగ్నిప్రమాదాలు వంటి సమయాల్లో పెను ముప్పుగా పరిణమించే అవకాశం ఉంది.
చిన్న బిల్డర్లకు టీడీఆర్ సెగ!
సామాన్య, మధ్యతరగతి బిల్డర్లను లక్ష్యంగా చేసుకుని ఈ జీవోలో నిబంధనలు పొందుపరిచారు. 750 నుంచి 2000 చదరపు మీటర్ల లోపు విస్తీర్ణం ఉన్న ప్లాట్లలో, 18 నుంచి 21 మీటర్ల ఎత్తు వరకు భవనాలు నిర్మించాలంటే ఇప్పుడు టీడీఆర్ వాడకం తప్పనిసరి చేశారు. చిన్నపాటి అపార్ట్ మెంట్లు కట్టాలన్నా..ముఖ్యనేత బంధువులు, అనుచరులు, ఇతర పెద్దల దగ్గరున్న టీడీఆర్‌లను కొనుకోవాల్సిందేనన్న మాట!
టీడీఆర్ వినియోగం – అదనపు అంతస్తులు
జీవో 95 ద్వారా 2000 చ.మీ కంటే ఎకువ విస్తీర్ణం ఉన్న ప్లాట్లలో రోడ్డు వెడల్పును బట్టి టీడీఆర్ ఉపయోగించి అదనపు అంతస్తులు నిర్మించుకునే వెసులుబాటును మరింత స్పష్టం చేశారు .40 అడుగుల రోడ్డులో 3 అదనపు అంతస్తుల వరకు. 60 అడుగుల రోడ్డు: 4 అదనపు అంతస్తుల వరకు, 80 అడుగుల రోడ్డులో 5 అదనపు అంతస్తుల వరకు అవకాశం ఇచ్చారు.
టీడీఆర్ అంటే ?
నగరంలో రోడ్లను విస్తరించాలన్నా, ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు..ఇతర అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టాలంటే భూ సేకరణ చేపట్టాల్సిందే..!! ధరలు పెరగడంతో ప్రాజెక్టు వ్యయంలో 70 శాతం నిధులను భూ సేకరణకే కేటాయించాల్సి వస్తోంది. అంటే రూ. 10కోట్లతో చేపట్టే రోడ్డు విస్తరణ పనులకు రూ. 70కోట్లు ఖర్చు పెట్టి భూ సేకరణ చేపట్టాల్సిన పరిస్థితులు నగరంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం టీడీఆర్ బాండ్లతో భూ సేకరణ పరిహారం చెల్లించే విధానాన్ని తీసుకువచ్చింది. యాజమానికి నగదు పరిహారం ఇవ్వకుండా..టీడీఆర్ బాండ్లను జారీ చేస్తోంది. పట్టా భూములకు 400 శాతం, చెరువుల్లోకి భూములకు 200 శాతం, బఫర్‌జోన్‌లోని భూములకు 300 శాతం టీడీఆర్ ఇస్తోంది.
ఈ టీడీఆర్‌ను యాజమాని సొమ్ము చేసుకున్నప్పుడే దానికి విలువ ఉంటుంది. ప్రభుత్వం టీడీఆర్‌తో ఒకటి లేదా అదనపు అంతస్తులు కట్టుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ బాండ్లు వాటి యాజమానుల వివరాలతో ప్రభుత్వం టీడీఆర్ బ్యాంకును కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. టీడీఆర్ అవసరమైన వారు..ఆ వెబ్‌సైట్‌ను సందర్శించి నేరుగా యాజమానులను సంప్రదించి , ధర మాట్లాడుకుని బాండ్లను కొనుగోలు చేయవచ్చు..రెండేండ్లలో టీడీఆర్ బాండ్లన్ని ముఖ్యనేత అనుచరుల్లోకి వెళ్లి..టీడీఆర్‌ను బ్లాక్ మార్కెట్‌గా మార్చడం గమనార్హం.