బన్సీలాల్‌పేట్, జనవరి 16: కొన్నేండ్లుగా మున్సిపల్ క్వార్టర్స్‌లో నివసిస్తున్న ప్రజలకు, ఇకపై ఆ ఇండ్లు వారి సొంతం కానున్నాయని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంక్రాంతి పండుగ రోజున శుభవార్త చెప్పారు. సనత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధి రాంగోపాల్‌పేట్ డివిజన్లోని నల్లగుట్ట, మోండా మార్కెట్ డివిజన్లోని ఆదయ్యనగర్, బన్సీలాల్‌పేట్ డివిజన్లోని న్యూబోయిగూడ ప్రాంతాలలో శనివారం పండుగ రోజున స్థానికులతో సమావేశం ఏర్పాటు చేసి లబ్ధిదారులకు ఈ తీపి వార్తను ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ ఎన్నో ఏండ్ల నుంచి ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు పెద్ద మనసుతో సీఎం కేసీఆర్ సంక్రాంతి కానుకగా మున్సిపల్ క్వార్టర్లను నామ మాత్రపు ధరకే రిజిస్ట్రేషన్ చేసేందుకు నిర్ణయించారని అన్నారు. దాని వలన 1137 పేద, మధ్య తరగతి కుటుంబాలకు లబ్ది చేకూరుతుందని అన్నారు. ఈ ప్రక్రియకు అవసరమైన పత్రాలను అందజేసి అధికారులకు సహకరించాలని ఆయన లబ్ధిదారులకు సూచించారు. సమావేశంలో బన్సీలాల్‌పేట్ కార్పొరేటర్ కే.హేమలత, బేగంపేట్ కార్పొరేటర్ టి. మహేశ్వరి, మాజీ కార్పొరేటర్లు ఏ.అరుణ, రూప, జీహెచ్ఎంసీ ఎస్టేట్ అధికారి బాషా, మూడు డివిజన్ల టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.