సిటీబ్యూరో, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): భూమల వేలం విషయంలో స్థానికుల అభ్యర్థనను పట్టించుకోకుండా కాంగ్రెస్ సర్కార్ ఇష్టారీతిన వ్యవహరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఖజానా నింపుకోవడమే లక్ష్యంతో.. ప్రజావసరాలను పట్టించుకోకుండా విశాలమైన ప్రభుత్వ భూములను విక్రయించే పనుల్లో నిమగ్నమైంది. ప్రజా ప్రయోజనాల కంటే.. ప్రస్తుత పరిస్థితుల్లో రెవెన్యూ తీసుకోవడానికే రేవంత్ సర్కార్ ప్రాధాన్యతనిస్తోంది.
దీంతో భవిష్యత్ అవసరాలకు అనువైన భూములు కోర్ సిటీలో కనిపించకుండా పోనున్నాయి. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో హుడా మాస్టర్ ప్లాన్ ప్రకారం హైదరాబాద్ నగరానికి శివారు ప్రాంతమైన మూసాపేటలో 15ఎకరాల విస్తీర్ణంలో భూమిని వేలానికి పెట్టింది. పారిశ్రామిక వాడల రవాణా, పార్కింగ్ సదుపాయాలను మెరుగుపరిచే లక్ష్యంతో ఈ స్థలాన్ని కేటాయిస్తే… ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కార్ వీటిపై బేరసారాలు చేస్తోంది.
దశాబ్ధాల కాలం పాటు ఈ ప్రాంతాన్ని ట్రక్ పార్క్‌గా వినియోగించారు. అప్పటి అవసరాలకు అనుగుణంగా నగరానికి వచ్చే వీలు లేకుండా, శివారు ప్రాంతంలోనే ట్రక్కులు, భారీ వాహనాలు నిలుపుకొనేందుకు ఏర్పాటు చేశారు. దీంతో నగరంలో భారీ వాహనాల తాకిడి తగ్గింది. ఒకవేళ ప్రభుత్వం ఈ భూములను విక్రయిస్తే.. ట్రక్కు పార్కింగ్ యార్డు కనుమరుగు కానుంది. ఇక భవిష్యత్తులో ఈ ప్రాంతం భారీ నిర్మాణ కార్యకలాపాలతో నిండిపోనుంది.
ఇందులో భాగంగా హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఆయా భూములకు సంబంధించి డిసెంబర్ 5న వేలం వేయనుంది. ఈ క్రమంలో నేటి నుంచి భూముల వేలం ప్రక్రియ మొదలు కానుంది. హుడా ఆధ్వర్యంలో కూకట్పల్లి మండలంలోని మూసాపేట్ గ్రామ శివారులోని సర్వే నంబర్ 121-141, 146, 147, 155-157లోని 11.48 ఎకరాలు, 3.18 ఎకరాల విస్తీర్ణంలోని రెండు సైట్లను విక్రయించడానికి హెచ్ఎండీఏ ఏర్పాట్లు చేసింది. ఎకరం రూ.75 కోట్ల చొప్పున విక్రయించనున్న ఈ భూములను స్థానికులకు మౌలిక వసతులు కల్పించేందుకు వినియోగించాలని డిమాండ్ ఉంది.
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూడా ఈ అంశంపై రాష్ట్ర సర్కార్ పెద్దలను కలిసి వివరించారు. భూముల వేలాని కంటే.. స్థానికుల కోసం మౌలిక వసతులను కల్పించే భవనాలు, మైదానాల నిర్మాణానికి ఇవ్వాలని సూచించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదు. భూములను వేలం వేయడం ద్వారా ఖజానా నింపుకోవాలని భావిస్తోంది.