అబిడ్స్, డిసెంబర్ 19 : జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల నుంచి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున రెవెన్యూ పన్నుల రూపేణా వస్తున్నా ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేసేందుకు నిధుల లేమిని అధికారులు కారణం చూపడంపై గోషామహల్ ఎమ్మెల్యే టి.రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ వెంకటేశ్ దోత్రేతో కలిసి వివిధ విభాగాల అధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
అనంతరం ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. అభివృద్ధి విషయమై జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ కమిషనర్, కాంట్రాక్టర్లు, వివిధ విభాగాల అధికారులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి పనులు జరిగేలా చూడాలని కోరారు. నియోజకవర్గంలో పెండింగ్ పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అధికారులు నిధులు లేవంటున్నారు..
నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో అధికారులను కోరితే నిధులు లేవని, కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు రావడం లేదని సమాధానం ఇస్తున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గం ప్రజలకు ఏ విధమైన సమస్యలు లేకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని కోరారు. అవసరమైన ప్రాంతాల్లో నిధుల విడుదలకు గాను ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు. నిధులు విడుదలై పెండింగ్లో ఉన్న పనులను ఐదు రోజుల్లో ప్రారంభించి సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.
నియోజకవర్గంలో అనేక పనులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. కాంట్రాక్టర్లను పనులు తొందరగా పూర్తి చేయాలని ఆదేశిస్తే బిల్లులు రావడం లేదని సాకులు చెబుతున్నారని, వెంటనే కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేసి పనులు జరిగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో జోన్ ఎస్ఈ సహదేవ్ రత్నాకర్, ఈఈ ప్రకాశం, టౌన్ ప్లానింగ్ ఏసీపీ సయ్యద్ సయీదుద్దీన్, డీఈలు పాల్గొన్నారు.